10 July, 2026 | 3:07 AM

అన్నదాత.. మారని రాత!

10-07-2026 12:46 AM
  1. రెండు నెలలు గడుస్తున్నా అందని ధాన్యం బిల్లు
  2. వానాకాలం పెట్టుబడులకు పైసలు లేక రైతుల అవస్థలు.     
  3. యూరియా కోసం తప్పని కష్టాలు
  4. ధాన్యం నగదు వెంటనే అందించాలని రైతుల వేడుకోలు

తుంగతుర్తి, జులై 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా,  గ్రామాల్లో ఐకెపి, రైతు సేవా, సహకార సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు సకాలంలో అందకపోవడంతో అన్నదాతలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. మరొక పక్క యూరియాను యాప్ లో బుక్ చేసుకుంటేనే పంపిణీ చేస్తుండడంతో అది రైతులకు అనుకున్న సమయానికి రాకపోవడంతో పంట మొక్కల ఎదుగుదలకు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుందని రైతులు మనోవేదన చెందుతున్నారు. ఈ రెండు విధానాలలో రైతులకు ఇబ్బందులు తప్పకపోవడంతో ఎన్నాళ్ళైనా అన్నదాత తలరాత మారడం లేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అడుగడుగునా అవస్థలే : తుంగతుర్తి మండలంలో సహకార సొసైటీ ద్వారా 11 సెంటర్లు, ఐకెపి ద్వారా 17 సెంటర్లలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశారు. మొదట రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటా పెట్టి, లారీల ద్వారా మిల్లుకు చేర్చారు. కొద్ది రోజుల అనంతరం సమయానికి ట్రాన్స్పోర్టేషన్ లారీలు రాకపోవడంతో, రైతులకు మూలిగే నక్క పై, తాటి పండు పడ్డ చందంగా పరిస్థితి మారింది. దీనితో కొంతమేర రైతుకు పండించిన పంటకు కాంటాలు ఆలస్యం జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు సైతం రెండు, మూడు రోజులు ఆపి దిగుమతి చేసుకున్నారు. దీనితో ఒక్కొక్క బస్తాకు రెండు, మూడు కేజీల తరుగు తీసి బిల్లులు పంపారు.

మండలంలోని చాలా లారీలు ఎగుమతి కాగా కటింగ్ బిల్లులే రైతుల చేతికి అందాయి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిలినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలు అయినా అందని బిల్లులు : ధాన్యం అమ్మి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఇతర పెట్టుబడులకు పైసలు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రతిరోజు సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో బిల్లులు సరిగా పడడంలేదని సిబ్బంది పేర్కొనడం పరిపాటిగా మారిపోయిందని రైతులే చెబుతున్నారు.       

యూరియాకు తప్పని తిప్పలు : యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రైతులకు దీనిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక్కోసారి సర్వర్ పని చేయకపోవడం, మరోసారి ఉదయం 6 గంటలకే అవకాశం ఇవ్వడం, బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఐదు నిమిషాల లోపే యూరియా కట్టలు అయిపోయినట్లు సూచించడంతో రైతులకు యూరియా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధాన్యం పెండింగ్ పిల్లలను అందించడంతోపాటు ఈ సీజన్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.                                

ధాన్యం బిల్లులను ఆన్ లైన్ చేశాం

ధాన్యం కొనుగో లు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యముకు సం బంధించిన రైతుల బిల్లులను ఇప్పటికే ఆన్ లైన్ ట్యాగింగ్ పూర్తి చేశాము. వంద శాతం డబ్బులు పడతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

యాదమ్మ, ఏపిఎం,  తుంగతుర్తి.  

పైసలు రాక ఇబ్బందులు పడుతున్నాం 

గడిచిన రెండు నెలలు నుంచి బిల్లు కో సం ప్రతిరోజు ఎదురుచూస్తున్నాం. సుమారు 200 బస్తాలు తుంగతుర్తి సహకార సొసైటీలో ధాన్యం ఎగుమతి చేశాం. రేపు, ఎల్లుండి అని మాటలు చెబుతున్నారు గాని పైసలు రావడం లేదు. వానాకాలం పంటకు అవసరమైన విత్తనాలు ఎరువులు కొనాలంటే పైసలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇంగ యూరియా బాధలు దేవుడెరుగు. అధికారులు మా బాధలను అర్థం చేసుకొని బిల్లులను వెంటనే చెల్లించాలి

నెమరుగొమ్ముల నిర్మల  రైతు, తుంగతుర్తి