13 April, 2026 | 8:43 PM

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

13-04-2026 07:20 PM

ప్రతిభావంతురాలైన హారికకు ప్రభుత్వం చేయూత అవసరం

మెరిసిన మార్కుల.. ముంచెత్తుతున్న పేదరికం

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 970 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించిన హారిక విజయగాథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మాల్ తుమ్మెదతండా గ్రామానికి, చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన హారిక, తన పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్య సాధన పట్ల అంకితభావంతో ఈ అద్భుత ఫలితాన్ని సాధించింది. చిన్న గ్రామం నుంచి వెలుగొందిన ఈ విజయం మండల స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో హారిక సాధించిన మార్కులు ఆమె నిరంతర శ్రమకు ప్రతిబింబంగా నిలిచాయి.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుపై ఎటువంటి రాజీ పడకుండా ముందుకు సాగడం ద్వారా ఆమె విజయం సాధించడం నేటి విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకురాలు కొండ మీరాతాయి హారిక నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు.శాలువాతో సన్మానించి రూ.5000 నగదు ప్రోత్సాహకంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హారిక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, హారిక వంటి విద్యార్థులకు అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.అయితే హారిక ఇంటి పరిస్థితులు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.

తాటాకులు, ప్లాస్టిక్ షీట్లతో నిర్మించిన చిన్న గుడిసెలోనే ఆమె కుటుంబం నివసిస్తోంది. వర్షాలు పడితే నీరు లోనికి చేరే పరిస్థితి, వేసవిలో తీవ్ర ఎండలు, గాలులకు రక్షణ లేకుండా ఉండటం వారి ఆర్థిక స్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ గుడిసె హారిక ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.హారిక తల్లిదండ్రులు కాట్రోత్ పుల్యా, అనసూయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా తమ కూతురి చదువుకు తోడ్పడటం వారి త్యాగానికి నిదర్శనం.

ఇలాంటి పరిస్థితుల్లోనూ హారిక తన చదువుపై దృష్టి కోల్పోకుండా కృషి చేసి ఈ స్థాయికి చేరుకోవడం ఆమె సంకల్పబలం ఎంత గొప్పదో తెలియజేస్తోంది.ఆర్థిక ఇబ్బందులు ఇప్పటివరకు హారిక విద్యకు అడ్డంకి కాలేకపోయినా, ఉన్నత విద్యను కొనసాగించాలంటే సహాయం అత్యవసరం. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి హారిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే హారిక కుటుంబానికి స్థిర నివాసం లభించడమే కాకుండా, ఆమె చదువుకు బలమైన పునాది ఏర్పడుతుంది.

ఇల్లు అనే ప్రాథమిక అవసరం తీర్చబడితే హారిక మరింత ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యాలను సాధించగలదు. అదేవిధంగా దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి హారిక ఉన్నత విద్యకు సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆమె ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తే భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి సేవ చేసే అవకాశం ఉంది.హారిక వంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో విద్యా ప్రాధాన్యత పెరుగుతుంది. పేదరికాన్ని జయించి విజయం సాధించిన ఆమె కథ మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. సరైన ప్రోత్సాహం లభిస్తే హారిక భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.