4 August, 2026 | 3:37 AM

స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

04-08-2026 12:00 AM
  1. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం 
  2. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో  నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేస్తూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో  సమన్వయ సమావేశంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. వేదిక, అతిథుల సీటింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత,  తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారి కి కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులతో దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్ , జెడ్పి సీఈఓ ఎల్లయ్య, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.