పని చేయించుకొని ఆర్నెల్లు.!
టీఏడీఏలు ఎప్పుడిస్తారు సారు.?
జీపీ సిబ్బంది నిరీక్షణ
మహబూబాబాద్,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో తమ చేత పనులు చేయించుకుని, ఆర్నెల్లు గడుస్తున్నా ఇప్పటివరకు టిఏ,డిఏ లు ఇవ్వడం లేదని జీపీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను శుభ్రం చేయించడానికి జిల్లావ్యాప్తంగా 200 మంది జీపీ కార్మికులను వినియోగించారు..20 అక్టోబర్ 20, నవంబర్ 25, 29, డిసెంబర్ 7న జిల్లా పరిధిలో నుండి గ్రామపంచాయతీ సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా హెడ్ కోటర్ గోదాము వద్ద బ్యాలెట్ బాక్సులను క్లీన్ చేయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు పనులు చేయాలని జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి రెండు వందల మందిని ఈ పనులకు వినియోగించారు. వారికి సమయానికి భోజనం, రవాణా చార్జీలు ఇవ్వలేదని వాపోతున్నారు.
అలాగే నామినేషన్ల స్వీకరణ సమయంలో కూడా వారి చేత రాత్రి వరకు పని చేయించుకుని ఎలాంటి బత్తెం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుండి అధికారులకు ఎన్నికల నిర్వహణ నిధులు వచ్చినట్లు తెలుసుకొని తమ పరిస్థితిని వివరించగా, మీకు ఎలాంటి టీ ఏ, డీ ఏలు ప్రభుత్వం విడుదల చేయలేదని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి టీ ఏ, డీ ఏ లు ఇచ్చి కేవలం జీపీ కార్మికులకు మొండి చేయి చూపిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. తమను గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి పంపిన మండల స్థాయి అధికారులు, టీఏ, డిఏ లు జిల్లా పంచాయతీ అధికారులు ఇస్తారని చెబుతున్నారని, జిల్లా అధికారుల వద్దకు వెళితే , మాకు ఎలాంటి నిధులు రాలేదని, మిమ్మల్ని మా వద్దకు పంపిన మండల శాఖ అధికారులే ఇస్తారని చెబుతూ దాట వేస్తున్నట్లు పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పని చేయించుకొని ఒక్క పైసా ఇవ్వకపోవడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు . ఈ విషయంపై ఈ ఏడాది జనవరిలో జిల్లా కలెక్టర్ కు పంచాయతీ కార్మికులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకునే నాధుడే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నిధులను అధికారులు, సిబ్బంది తలా కొంత పంచుకొని, పనిచేసిన తమకు మాత్రం ఉత్త చేతులు చూపడం సరైన పద్ధతి కాదని పేర్కొంటున్నారు.
చేసిన పనులకు టిఏ,డీఏ చెల్లించాలి
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలో విధులు నిర్వహించిన దాదాపు 200 మంది జీపీ కార్మికులకు టిఏ,డిఏ లు చెల్లించాలి. జిల్లా పరిధిలోని వివిధ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు సొంత ఖర్చులతో జిల్లా కేంద్రానికి వెళ్లి ఐదు రోజులపాటు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ, టిఎ,డిఎ లు చెల్లించకపోవడం ఏ మేరకు సమంజసం. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ చిరుద్యోగులను విస్మరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన టి ఏ, డిఏ బకాయిలను చెల్లించాలి.
బీ.ఎల్లయ్య, తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం, జిల్లా ఉపాధ్యక్షుడు






