రాష్ట్ర స్థాయికి జావలిన్ త్రోలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకారుడు ఎంపిక
కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జి. చంద్రశేఖర్ (బి.ఏ. ద్వితీయ సంవత్సరం) జావలిన్ త్రోలో అద్భుత ప్రదర్శనతో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటారని ఇన్ఛార్జ్ పి.డి.డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు.ఉన్నత విద్యకు, క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి చంద్రశేఖర్ ను అభినందించారు.
ప్రస్తుతం దోస్త్ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని గ్రామీణ ప్రాంత ఆణిముత్యాలైన మన విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో అనేక పతకాలు సాధిస్తూ కళాశాల కీర్తిని చాటుతున్నారు.
విశాలమైన క్రీడా మైదానం, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కూడిన ఉన్నత ప్రమాణాల కూడిన విద్యతోపాటుగా క్రీడల ద్వారా లభించే రిజర్వేషన్లతో విద్యార్థులు త్వరగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో రాణించడం విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సిబ్బంది చంద్రశేఖర్కు శుభాకాంక్షలు తెలిపారు.






