ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు న్యాయం చేయాలి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ డా. మల్లు రవి, ఒగ్గు పర్వతాలు
నాగర్ కర్నూల్, జూలై 14 (విజయక్రాంతి): ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థలో మోసాలకు గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, సామాజిక కార్యకర్త ఒగ్గు పర్వతాలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో జరిగిన ఆర్థిక మోసాల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద వచ్చిన డబ్బులను, పేద రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తమ జీవితకాల పొదుపు సొమ్మును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. బాధిత కుటుంబాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నాయని పేర్కొన్నారు. మోసాలకు పాల్పడిన వ్యక్తుల ఆస్తులు, భూములను వెంటనే జప్తు చేసి, చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బాధితుల పరిస్థితిని సానుభూతితో పరిశీలించి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని, నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఎంపీ డా. మల్లు రవి కోరారు. ఈ సందర్భంగా ఒగ్గు పర్వతాలు మాట్లాడుతూ, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






