పాలిసెట్‌లో బాలికలదే హవా
- బాలికలు 86.38 శాతం,
- బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత
- ఎంపీసీ స్ట్రీమ్‌లో తొలి ర్యాంక్ నామాల లోకేష్, ఎంబైపీసీలో కోట్ల అపూర్వ
- 27 నుంచి కౌన్సిలింగ్ షురూ
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సుల్లో(పాలిటెక్నిక్) ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో తొలి ర్యాంక్ నామాల లోకేష్, ఎంబైపీసీలో కోట్ల అపూర్వ సాధించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది మొత్తం 1,06,439 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,029 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 81,307 (82.94 శాతం) మంది విద్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలురు 52,201 మందిలో 41,719 (79.92 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 45,828 మంది బాలికలకు 39,588 (86.38 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో తొలి ర్యాంక్‌ను వరంగల్ జిల్లాకు చెందిన నామాల లోకేష్, ద్వితీయ ర్యాంక్‌ను సూర్యాపేట జిల్లాకు చెందిన బానోతు హేమంత్ సాధించారు.
ఎంబైపీసీ ్రస్ట్రీమ్‌లో మహబూబ్‌నగర్‌కు చెందిన కోట్ల అపూర్వ, ద్వితీయ ర్యాంక్‌ను సిద్దిపేట్‌కు చెందిన రుద్రోజు సాజన్ సాధించారు. పాలిసెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చన్నారు. 2026--27 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.






