రేపటి నుంచి ‘రైతు గోస.. బీజేపీ భరోసా’
- కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్న బీజేపీ నేతలు
- తొలి రోజు తాండూర్, గజ్వేల్‌లో నాయకుల పర్యటన
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ‘రైతు గోస... బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి క్షేత్రస్థాయిలోని పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో ముఖాముఖి కానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుతోపాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కొనుగోలు కేంద్రాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు.
తొలిరోజు తాండూర్‌లో, రెండో రోజు గజ్వేల్, భువనగిరి, వరంగల్‌లో, మూడో రోజు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పోరుబాట నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రైతులకు అండగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పంటను తక్షణమే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
షెడ్యూల్ ఇలా...
25వ తేదీన: మొదటి రోజు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి తాండూరులోని వ్యవసాయ మార్కెట్ సెంటర్‌ను ఉదయం 11.30 గంటలకు సందర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యలో రైతులతో ముఖాముఖి. సాయంత్రం 6.30 గటల సమయంలో గజ్వేల్ అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి అక్కడే గజ్వేల్‌లో బస చేస్తారు.
26వ తేదీన: రెండో రోజు గజ్వేల్ నుంచి భువనగిరికి చేరుకుంటారు. 9.30-10.30 మధ్య లో అక్కడ అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను రైతులతో కలిసి సందర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 1.30-3.30గంటల మధ్యలో వరంగల్ అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శిస్తారు. అదేరోజు వరంగల్ నుంచి భూపాలపల్లికి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
27వ తేదీన: మూడో రోజు ఉదయం 8.30-10.30 గంటల మధ్యన భూపాలపల్లి అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శించి, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.30-11.15 గంటలకు కాటారంకు బయలుదేరుతారు. అక్కడ 11.15-1.00 గంటలకు కాటారంలోని అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శిస్తారు. అదేరోజు 2.00-2.30 గంటల మధ్యలో కాటారం నుంచి మంథనికి వెళ్లి, అక్కడ అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4.00-5.00 గంటలకు మంథని నుంచి పెద్దపల్లికి చేరుకుని అక్కడ 5.00-7.00 గంటలకు అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు.






