గంజాయి ముఠా గుట్టు రట్టు.. నలుగురు అరెస్ట్
మేడిపల్లి,(విజయక్రాంతి): ఇంటిపై దాడి చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తూ, విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి, అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈగిల్ టీమ్, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పీర్జాదిగూడ రాయంచా ఎన్‌క్లేవ్, రోడ్ నెం.8లోని ఓ ఇంటిపై దాడి చేసి, మూడు ప్యాకెట్లలో దాచిన మొత్తం 1.504 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక వెయింగ్ మెషిన్, మొబైల్ ఫోన్, 4 బైక్‌లను సీజ్ చేశారు.
నిందితులు దోతుల పృథ్వీరాజ్, షేక్ సమీర్, మోదపల్లి దయాసాగర్, జంపాల శామ్ కుమార్ అనే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చుకుని, చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి బైక్‌లపై సరఫరా చేస్తూ విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని, గంజాయి సరఫరాదారు సురేష్, ఇతర సహచరులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ లో పాల్గొని విజయవంతంగా నిర్వహించిన ఈగిల్ టీమ్, మేడిపల్లి పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించినట్లు మేడిపల్లి సీఐ శంకరయ్య తెలిపారు.






