calender_icon.png 7 February, 2026 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణ స్నేహితుడు కాలయముడయ్యాడు

07-02-2026 01:06:26 PM

  1. తాగుదామని  నమ్మించి హత్య చేసిన ప్రాణ స్నేహితుడు
  2. పాత కక్షతో యువకుడి హత్య.. నిందితుడి అరెస్ట్
  3. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ఘటన 

జిన్నారం/అమీన్ పూర్: మద్యం మత్తులో మొదలైన గొడవ, పాత కక్ష చివరకు ఒక యువకుడి ప్రాణం తీసింది. ఖాజిపల్లి గ్రామం, జీఎంఆర్ కాలనీ ప్రాంతంలో కలకలం రేపిన ఈ హత్య కేసును బొల్లారం పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి  వెల్లడిస్తూ, నేపాల్‌కు చెందిన దీపన్ తప (26) అనే యువకుడు ఈ నెల 4వ తేదీన ఖాజిపల్లి గ్రామం జీఎంఆర్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో శవమై కనిపించాడని తెలిపారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు లో   అమీన్‌పూర్ డీఐ సత్యనారాయణ, పటాన్‌చెరు డీఐ రాజు వారి సిబ్బంది అందించిన సహకారంతో, సీసీ కెమెరా దృశ్యాలు మరియు సాంకేతిక ఆధారాల సాయంతో గొల్లగూడెంకు చెందిన వరకంటి దిలీప్ (26)ను నిందితుడిగా గుర్తించి, శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడు దిలీప్ మరియు మృతుడు దీపన్ తప గతంలో స్నేహితులని, ఒకసారి మద్యం తాగే సమయంలో జరిగిన గొడవ వల్ల దీపన్ పై దిలీప్ పగ పెంచుకున్నాడని విచారణలో తేలింది. పథకం ప్రకారం ఈ నెల 3వ తేదీ రాత్రి, మద్యం తాగుదామని దీపన్‌ను నమ్మించి దిలీప్ తన స్కూటీపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, దీపన్ మత్తులోకి జారుకోగానే దిలీప్ ముందస్తు పథకం ప్రకారం రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతుడి ఫోన్‌ను దారిలో విసిరేసి అక్కడి నుంచి పారిపోయాడు. కేసును  ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు  అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.