సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా...
ట్రాఫిక్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించిన డీసీపీ
మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళ వారం మంచిర్యాల మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెనలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా డిసిపీ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 12 రోజుల పాటు కాళేశ్వరం సరస్వతి నది తీరంలో జరగనున్న అంత్య పుష్కరాలకు కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జైపూర్, భీమారం, చెన్నూర్ మార్గాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
భక్తుల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీసీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్‌ఐ రాజశేఖర్, భీమారం ఎస్‌ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






