20 May, 2026 | 2:38 AM

విస్తరణ ఎప్పుడు?

20-05-2026 01:15 AM
  1. మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ 
  2. ఐదు అసెంబ్లీల ఎన్నికల ముగిసినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కాంగ్రెస్ హైకమాండ్ 
  3. అమాత్య పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు
  4. మహిళలకు కోటా దక్కేనా? 
  5. ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్లో ఒకటి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ 
  6. ఎస్టీ నుంచి లంబాడాలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమై ఉన్నందున.. వాటి ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ అధిష్ఠానం అంతర్గతంగా సిగ్నల్ ఇచ్చిందని పార్టీ నాయకులు చెప్పుకున్నారు.

అంతేకాకుండా పీసీసీ ముఖ్య నేత కూడా పలు సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొందరు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉందని ప్రస్తావించారని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. అయితే అసెంబ్లీల ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు కూడా కొలువుదీరాయి. అయినా, తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులతో పాటు కొందరు మంత్రుల శాఖల మార్పు అనే అంశంలో కదలిక కనిపించడంలేదు.

రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న రెండు బెర్తుల కోసం అర డజన్ మంది ఆశావహులు ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈసారి విస్తరణలో బీసీలకు బెర్తు దక్కుతుందా.. మహిళా ప్రాతినిథ్యం సమతూకంగా ఉం టుందా.. అనే ప్రశ్నలు మళ్లీ ముందుకొస్తున్నాయి. మహిళలకు ఈసారి విస్తరణలోనైనా సముచిత స్థానం లభించాలని డిమాండ్లు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఇటీవలనే తన కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని రాహుల్‌గాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. అదే రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రిపదవిని కోరుతున్నారు. ఇక  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమాత్య పదవి కోసం మొద టినుంచి పట్టుబడుతున్నారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఇచ్చిన హామీని అమలుచేయాలని పలు సందర్భాల్లో బాహటంగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్‌రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నదనే వాదన కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.

ఒకవేళ విస్తరణ జరిగితే రాజగోపాల్‌రెడ్డికి.. రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని పార్టీ నాయకులు కొందరు బలంగా చెబుతున్నారు. గతంలో పార్టీని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన రాజగోపాల్‌రెడ్డి గత కొంతకాలంగా మౌనంగా ఉండటం.. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సాను కూల సంకేతాల ఫలితమే అయి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. 

ఇదిలాఉంటే, ఉత్తర తెలంగాణ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమివ్వాలనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. క్యాబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రులు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. 

ఇప్పుడు కొత్తగా ఉత్తర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి రెడ్డి సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించుకునేందుకు కుట్ర జరుగుతున్నదని ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు మిగతా వర్గాలనుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అది కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరును మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఇక రాష్ట్రంలోని మొత్తం  జనాభాలో 56 శాతం వరకు ఉన్న బీసీ వర్గాల నుంచి కేవలం ముగ్గురు మంత్రులే ఉన్నారు. వీరిలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి మంత్రులుగా ఉండగా, మరో ఒకరికి లేదా ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్ మొదటినుంచి వినిపిస్తోంది. ఇక ఎస్టీ సామాజిక వర్గంలోని ఆదివాసీల నుంచి మంత్రి సీతక్క మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, లంబాడాల నుంచి కూడా క్యాబినెట్‌లో చోటు కల్పించాలని కోరుతున్నారు.

మైనార్టీల నుంచి మంత్రిగా అజారుద్దీన్ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రు లుగా ఉన్నారు. అసెంబ్లీ  స్పీకర్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారనే చర్చ జరుగుతోంది.