20 May, 2026 | 3:00 AM

కొత్త హెల్త్ స్కీం!

20-05-2026 01:56 AM
  1. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్
  2. జూన్ 2న ఆరోగ్య కార్డుల జారీకి సన్నాహాలు
  3. ఉద్యోగులు, పెన్లనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు ప్రభుత్వం ఆదేశం
  4.   31 నాటికి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచన

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల నూతన హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) అమలుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

సేకరించిన వివరాలను ఈనెల 31 నాటికి ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆయా శాఖల హెచ్‌ఓడీలు, డీడీవో(డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్)లు, పెన్షన్ అధికారులకు సూచించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన వారు సుమారు 14 లక్షల మంది వరకు ఉంటారు. వీరందరికీ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.    

క్యాష్‌లెస్ సేవలు

నూతన హెల్త్  స్కీం కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత సేవలు అందనున్నాయి. ప్రస్తుతం ఉన్న హెల్త్ స్కీం సరిగా అమలు కాకపోవడంతో ఆయా వర్గాల అభ్యర్థన మేరకు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ (ఈహెచ్‌టీ) ట్రస్ట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం, ఉద్యోగుల భాగస్వామ్యంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నూతన హెల్త్ స్కీంను అమలు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం చొప్పున నిధులు వసూలు చేసి, ప్రభుత్వం కూడా అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తుంది. ఈ నిధులను ట్రస్టులో జమ చేసి ఉద్యోగుల వైద్యసేవలకు ఉపయోగించనుంది. 

అయోమయంలో డీడీవోలు

ఇదిలా ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లు ఈనెల చివరిలోపు డిజిటలైజేషన్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డీడీవోలు అయోమయంలో పడ్డారు. రెండు, మూడు సంవత్సరాలుగా పలువురి ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్‌కు నోచుకోలేదు. ప్రభుత్వ ఉత్తర్వులతో డీడీవోలు తలలు పట్టుకుంటున్నట్లు తెలి సింది. ఉన్నఫలంగా వాటిని అప్డేట్, డిజిటలైజేషన్ చేయించడానికి సమయం సరిపోదని పలువురు డీడీవోలు పేర్కొంటున్నారు.