ఏరోస్పేస్‌లో అగ్రగామి
- జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న తెలంగాణ
- డ్రోన్ టెక్నాలజీలోనూ ముందంజ
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కన్న ఎక్కువ ఎగుమతులు
- ఫార్మా వాటా 25 శాతం, ఏరోస్పేస్ వాటా 33.4 శాతం
- ఏటేటా రెట్టింపు వృద్ధి
- ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఫార్మా హబ్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ.. ప్రస్తుతం ఏరోస్పేస్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తుల తయారీలో దేశానికే దిక్చూచిగా నిలువగా.. ఇప్పుడు విమాన విడి భాగాలు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, క్షిపణి సాంకేతికత తయా రీలోనూ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఆ రంగానికి చెందిన ఎగుమతులు రెండేళ్లలోనే రెట్టింపు కావడమే నిదర్శనం. రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగం వాటా 33.4 శాతం కాగా, ఫార్మా రంగం వాటా 25 శాతంగా నమోదైంది.
రెండేళ్లలోనే రెట్టింపు..
ఏరోస్పేస్ రంగానికి సంబంధించి 2023- -24లో తెలంగాణ నుంచి రూ. 15,940 కోట్లు విలువ చేసే ఎగుమతులు జరగగా, రెండేళ్ల వ్యవధిలోనే రూ.32,850 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఏరోస్పేస్ రంగం అభివృద్ధి చెందుతున్నా... తెలం గాణలో వృద్ధి మరింత వేగంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి ఉత్పత్తుల్లో ముఖ్యంగా విమాన భాగాలు, ఫ్యూజలేజ్ అవియానిక్స్ పరికరాలు, డ్రోన్లు, క్షిపణి భాగాలు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, రాడార్ పరికరాలు అమెరికా, యూరప్ దేశాలకు రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నాయి.
హైదరాబాద్ చుట్టూ ఏరోస్పేస్ క్లస్టర్లు
ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంది. ప్రధానంగా అదిబట్ల, కొత్తూర్, శంషాబాద్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదిబట్లలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్ ) అనేక అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది. అక్కడే విమాన భాగాల తయారీ యూనిట్లు, డిఫెన్స్ సిస్టమ్స్ అసెంబ్లీ కేంద్రాలు, పరిశోధన సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. కొత్తూర్ ప్రాంతంలోనూ పరిశ్రమల విస్తరణ వేగంగా జరుగుతోంది.
దిగ్గజ కంపెనీల దృష్టి
ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ సంస్థలైన లాక్‌హిడ్ మార్టిన్, బోయింగ్ సాఫ్రాన్, డస్సాల్ట్ ఏవియేషన్ , టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్, అదానీ ఏరోస్పేస్ తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు తెలంగాణను కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా పూర్తిస్థాయి తయారీ, పరిశోధన, సప్లై చైన్ హబ్‌గా ఉపయోగిస్తున్నాయి. దీని వల్ల స్థానిక ఎంఎస్‌ఎంఈలకు కూడా భారీ అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో వెయ్యికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈ) కూడా ఈ రంగంలో భాగ స్వాములవుతున్నాయి.
మేక్ ఇన్ ఇండియాకి ఊతం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కార్యక్రమాలకు తెలంగాణ ప్రధాన భాగస్వామిగా మారుతోంది. దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారాన్ని తగ్గించే దిశగా స్వదేశీ తయారీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తయారవుతున్న రక్షణ రంగం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో యుద్ధ వ్యూహాలు, వ్యవసాయం, లాజిస్టిక్స్, పర్యవేక్షణ రంగాల్లో డ్రోన్ల వినియోగం మరింత పెరగనుంది. ఇప్పటికే తెలంగాణలో అనేక డ్రోన్ తయారీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి.
నైపుణ్య యువత మన బలం
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో శిక్షణ పొందిన యువత పరిశ్రమలకు బలంగా మారుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏరోస్పేస్ రంగానికి అనుకూలంగా మారుతోంది. కార్గో సదుపాయాలు, ఎగుమతుల రవాణా, అంత ర్జాతీయ కనెక్టివిటీ పెరగడం మేలు చేస్తోంది.






