13 August, 2026 | 12:04 AM

నీట్, జేఈఈలకు లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ

12-08-2026 08:46 PM

ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

బిసి గురుకులాల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త రాధిక

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇంటర్‌ పూర్తి చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ అందించనున్నట్లు బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి. రాధికా తెలిపారు.

నీట్-యూజీ, జేఈఈ-2027 ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత లాంగ్‌టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందించ నున్నట్లు తెలిపారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన, నీట్, జేఈఈ-2026లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శిక్షణకు అర్హులవుతారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 16వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://mjptbcadmissions.org వెబ్‌స వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణను బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సి రాధికా సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని నీట్, జేఈఈలో ఉత్తమ ఫలితాలు సాధించి వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని ఆకాంక్షించారు.