12 August, 2026 | 11:58 PM

తాహసిల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన రైతు

12-08-2026 09:53 PM

భూ వివాదంపై మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం..

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్‌ గ్రామానికి చెందిన రైతు గోస్కుల రవీందర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కదంబాపూర్‌ గ్రామంలో  రవీందర్‌కు 20 గుంటల పట్టా భూమి ఉంది. పక్కనే చింతలరాఘవరెడ్డికి చెందినభూములుఉన్నాయి. గతంలో ఈ రెండు భూముల మధ్య నక్ష ప్రకారం దారి ఉందని రాఘవరెడ్డి ఆర్‌ఎస్‌ఐ, డీఐలకు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులు కొలతలు నిర్వహించి నక్షలో ఉన్న దారిని ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు.దీంతో రాఘవరెడ్డి దారిలో మట్టి పోస్తుండగా రవీందర్‌ అడ్డుకున్నారు, ఆ భూమి తనదేనంటూ రవీందర్ వాదిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ముందు పురుగుల మందు తాగాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే అతడిని సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.