12 August, 2026 | 11:15 PM

ఖైదీల విద్యా విజయంతో తెలంగాణ జైళ్లకు జాతీయ గుర్తింపు

12-08-2026 09:57 PM

ఉప్పల్,(విజయక్రాంతి): తెలంగాణ జైళ్లలో అమలవుతున్న సంస్కరణాత్మక కార్యక్రమాలు మరోసారి ఫలితాన్నిచ్చాయి. ఈ ఏడాది నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన 78 మంది ఖైదీలు ఉత్తీర్ణులై కొత్త చరిత్ర సృష్టించారు. ఖైదీలకు విద్యను అందించి వారిని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలకు ఇది నిదర్శనంగా నిలిచింది.

జైళ్లను కేవలం శిక్ష అమలు కేంద్రాలుగా కాకుండా సంస్కరణ, పునరావాస కేంద్రాలుగా మార్చే దిశగా తెలంగాణ కారాగార శాఖ విశేష కృషి చేస్తోంది. ప్రత్యేక బోధనా తరగతులు, విద్యా సదుపాయాలు, మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఖైదీలను పరీక్షలకు సిద్ధం చేశారు. దాని ఫలితంగానే 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ మరియు సంస్కరణల సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా,  ఖైదీలను అభినందించారు.

విద్య వ్యక్తిత్వ వికాసానికి, జీవిత మార్పుకు ప్రధాన సాధనమని ఆమె పేర్కొన్నారు. జైలు జీవితం అనంతరం సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి విద్య ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఖైదీల విజయంతో ఇతర ఖైదీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జైళ్లలో అమలవుతున్న విద్యా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.