13 August, 2026 | 1:33 AM

బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా సీఎం రేవంత్?

13-08-2026 12:00 AM
  1. జీఆర్‌ఎంబీ అజెండాపై ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు?
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : జీఆర్‌ఎంబీ సమావేశ అజెండాపై బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సీఎం రేవంత్‌రెడ్డికి సోయి రాలేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం తమ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ అజెండాలో పెడితే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీ ప్రతి పాదిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదు?, ఎందుకు జీఆర్‌ఎంబీని నిలదీయలేదు?, ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నిలదీశారు.

ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందించారు. లేఖలతో పనులు కావు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలని హరీశ్ హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం జీఆర్‌ఎంబీ అజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని, అవసరమైతే.. ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి.. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు.. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం.. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన విషయమని తెలిపారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగే జీఆర్‌ఎంబీ అజెండాను ఉపసంహరించుకోకుండా నిర్వహిస్తే.. తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్‌ఎస్ పార్టీ వేలాది మందితో జీఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న జీఆర్‌ఎంబీ, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామన్నారు. 

ఎంజీఎంలో బెడ్ లేదు.. కాంగ్రెస్ పాలనలో పేదలకు భరోసా లేదు

 వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తీవ్ర అస్వస్థతతో వచ్చిన ఓ రోగికి బెడ్ అందుబాటులో లేక నేలపైనే పడుకోవాల్సి వచ్చిన దృశ్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థ దుస్థితికి ఈ దృశ్యం సజీవ సాక్ష్యమని విమర్శించారు. దవాఖానలో బెడ్ లేదు.. కాంగ్రెస్ పాలనలో పేదలకు భరోసా లేదని మండిపడ్డారు.

నాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన  ప్రభుత్వ వైద్యం.. నేడు పేద రోగులకు కనీసం బెడ్ కూడా అందించలేని దుస్థితికి చేరిందని విమర్శించారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి వచ్చిన రోగి నేలపైనే పడుకుని వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఎంజీఎం పరిస్థితులను తక్షణమే చక్కదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.