13 August, 2026 | 1:29 AM

టీ ట్వంటీలకే పరిమితం

13-08-2026 12:00 AM

బుమ్రా సంచలన నిర్ణయం ?

సీఓఈ సలహాతో టెస్ట్, వన్డేలకు దూరం

2027 వరల్డ్ కప్ తర్వాత అమలు

తరచూ గాయాల బారిన పడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇకపై ఒకే ఫార్మాట్‌కు పరిమితం కానున్నాడా ? ఫిట్‌నెస్ సమస్యలు అధిగమించే క్రమం లో సుధీర్ఘ కాలం కెరీర్ కొనసాగించాలంటే ఇకపై టెస్ట్ , వన్డేలు ఆడకూడదని బీసీసీఐ సీఓఈ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ స్టార్ పేసర్ కేవలం టీ ట్వంటీ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు.

బెంగుళూరు, ఆగస్టు 12 : క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా గాయాలు సహజం. ఫాస్ట్ బౌ లర్లకు ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. భిన్నమైన బౌలింగ్ యాక్షన్ ఉండే బుమ్రా అయితే ఇప్పటికే ఎన్నోసార్లు గాయాలతో సతమతమయ్యాడు. వరుస గాయాలతోనే కీలక సిరీస్‌లకు దూరమవుతు న్నాడు. బీసీసీఐ వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొన్ని సూచనలు పాటిస్తున్నా కూడా ఫిట్‌నెస్ స మస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బుమ్రా తరచూ గాయాల బారిన పడటానికి ప్రధాన కారణం అతని విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ అని పలువురు చెబుతారు.

బుమ్రా నాన్-యాక్టింగ్ ఆర్మ్ తక్కువగా ఉపయోగి స్తూ, రన్నింగ్ తర్వాత చివరి క్షణంలో ఎడమవైపునకు ఎక్కువగా వంగి బౌలింగ్ చేస్తాడు. దీనివల్ల అతని వెన్నుపూస, మోకాళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. మూడు ఫా ర్మా ట్లలో నిరంతరం ఆడటం, ఐపీఎల్ లాంటి లీగ్లలో విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు కొనసాగించడం వల్ల శరీరం అలసిపోయి గాయాలు తిరగబెడుతున్నాయి. ఇటీవల ఇంగ్లం డ్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలికి, వేలికి గాయాలయ్యాయి. దీంతో శ్రీలంక సిరీస్ వంటి ముఖ్యమైన టూర్ల నుంచి కూడా అతను దూరంగా ఉండాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో బుమ్రా ఒకే ఫార్మాట్‌కు పరిమితం కానున్నాడు. వరుస గాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో మాత్రమే కొనసాగే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా జట్టు ఉండాలని బీసీసీఐకి మెడికల్ టీమ్ కూడా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. బుమ్రా ను బీసీసీఐ మెడికల్ టీమ్, సీఓఈ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని, అతను త్వరగా కో లుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని బో ర్డు వర్గాలు పేర్కొన్నాయి. అతను టెస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసి చాలా కాలమైందనీ, బుమ్రా ఆరోగ్యం విషయంలో క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉందనీ తెలిపాయి.

అతని రీఎంట్రీ గురించి వారు ఇంకా ఎలాంటి కాలపరిమితిని ప్రకటించలేదనీ, ఏదేమైనా.. వచ్చే ఏడాది తర్వాత ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని భవిష్యత్తుకు భారత క్రికెట్ సి ద్ధం కావాలని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత జస్ప్రీత్ బుమ్రా కేవలం టీ20 ఫార్మాట్లోనే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కెరీర్ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే బుమ్రా ఒక్క ఫార్మాట్ ఎంచుకుంటాడనే అభిప్రా యం కలుగుతోంది.  ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుమ్రా గైర్హా జరీలో టీమిండియా టెస్ట్‌లో రాణించడం కష్టం. బుమ్రా స్థాయి బౌలర్‌ను భారత్ త యారు చేసుకోలేకపోయింది. భారత ప్రధా న ఆటగాళ్లంతా వరుసగా గాయాల బారిన పడుతుండటం సమస్యగా మారింది.