పెద్దమ్మ గుడి వద్ద షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
సొంత నిధులతో ముందుకు వచ్చిన నీలం మధు
పటాన్ చెరు, జూన్ 7 : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్ లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎండకు, వానకు పడుతున్న ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని నీలం మధు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, ప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ కోసం వేచి చూడకుండా, భక్తుల కష్టాలను తీర్చడమే ధ్యేయంగా తన సొంత నిధులతోనే ఈ షెడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఉదారంగా ముందుకు వచ్చారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో కౌన్సెలర్ మల్లేశ్వరి కుమారుడు మణికంఠ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నీలం మధు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు.
అనంతరం షెడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేసి నిర్మాణ వ్యయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్నాపూర్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి ప్రతి వారం నియోజకవర్గ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారని, ముఖ్యంగా పండుగలు, జాతరల సమయంలో సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు.
ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు అందుబాటు లోకి తీసుకువస్తామని, ప్రజాసేవలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి మణికంఠ, కౌన్సిలర్స్ మన్నే రాఘవేంద్ర, వెంకటేష్ నాయక్, సంగన్నగారి గోపాల్, సందీప్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రాఘవేంద్ర, శంకర్, సంజీవ, ఆంజనేయులు, కృష్ణ, రాజు, మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, యువకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






