8 June, 2026 | 1:48 AM

వీరన్నగుట్ట క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం..

08-06-2026 12:42 AM

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

నాగోల్, జూన్ 7 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్ (ప్రస్తుత లెక్చరర్స్ కాలనీ) పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ వీరన్నగుట్ట భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధి పనులపై బీఆర్‌ఎస్ యువ నాయ కుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలకు చెందిన పది నుంచి పన్నెండు కాలనీల ప్రతినిధులు, కాలనీవాసులు సమావేశంలో పాల్గొని క్షేత్ర అభివృ ద్ధి, కాలనీల్లో నెలకొన్న సమస్యలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై తమ సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం రహదారులు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థలను మెరుగుపరచాలని కోరారు.

సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీల అభివృద్ధిలో కాలనీ అసోసియేషన్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తయిన అనంతరం మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ట్రంక్ లైన్ వ్యవస్థ ఇప్పటికే ఏర్పాటు చేశామని, ప్రస్తుతం కొన్ని కాలనీల్లో కొత్త డ్రైనేజీ నిర్మా ణ పనులు కొనసాగుతున్నందున ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు పూర్తయిన వెంటనే అన్ని కాలనీల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వీరన్నగుట్ట క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగిన పుణ్యక్షేత్రమని, భక్తులకు అన్ని విధాలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ అభివృద్ధి కోసం గతంలో అప్ప టి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేయించామని గుర్తు చేశారు.

మొదటి విడతగా రూ.5 కోట్లతో ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు మందగమనంలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోమని, వీరన్నగు ట్టను రాష్ట్రంలోనే ఆదర్శ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజాప్రతిని ధులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ సంఘాల ప్రతినిధులు, భక్తుల సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.

సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, చెన్నగోని శ్రీధర్ గౌడ్, నక్క రవీందర్ గౌడ్, మల్లీశ్వరి రెడ్డి, ధనలక్ష్మి, కళ్లెం రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, శంకర్ రెడ్డి, నాగభూషణం, యాదగిరి, సీతారాం, సోమనాథ్, వెంకన్న, సత్యం, వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.