13 April, 2026 | 4:20 AM

పేదల పథకాలన్నీ రద్దు చేశారు

13-04-2026 02:25 AM
  1. సిద్ధిపేట అంటే కండ్లమంట, ఈర్ష్య 
  2. కేరళకు వెళ్లి పచ్చి అబద్ధాలు
  3. కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు
  4. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరిక
  5. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని, పేదల కోసం తెచ్చిన పథకాలన్నీ రద్దు చేశారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన పథకాలు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, బీసీ బంధు, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, ఇలా చెప్పుకుంటూ పోతే పేదల కోసం తెచ్చిన పథ కాలన్నీ రద్దు చేశాడని చెప్పారు.

‘గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసినటు’్ట సీఎం పనితీరు ఉందన్నారు. గ్రామసభలలో ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తుంటే రేవంత్ రెడ్డి కేరళకు పారిపోయాడని విమర్శించారు. ఆదివారం సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి దొంతుల సురేష్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు పాషాలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ పరిస్థితి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉందని విమర్శించారు. కేరళకు వెళ్లి తన ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అమలైపోయాయని, కావాలంటే తెలంగాణకు వచ్చి చూసుకోవచ్చని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద అక్కాచెల్లెళ్లకు నెలకు రూ.2500, అవ్వాతాతలకు రూ. 4000 పెన్షన్, కల్యాణలక్ష్మి కింద లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని దారుణంగా మోసం చేశారన్నారు.

ఇది పేదల ఇండ్లు కూలగొట్టే సర్కార్, ఈ ప్రభుత్వం కొత్తగా కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు కానీ, కూల్చిన ఇళ్లే కోకొల్లలుగా ఉన్నాయని చెప్పారు. అమీన్‌పూర్‌లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శని, ఆదివా రాల్లో పేదల ఇండ్లను కూల్చేశారని తెలిపారు. హైడ్రా అంటే పేదల బతుకులు ఆగం చేయడానికా? అంటూ ప్రశ్నించారు. త్వరలో మున్సి పల్ ఎన్నికలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత వాగ్ధానాలు, హామీలను నమ్మొద్దన్నారు.

రేవంత్‌రెడ్డికి సిద్దిపేట అంటే కండ్లమంట, ఈర్ష్య, అందుకే సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని రద్దు చేశాడని, కోమటి చెరువు వద్ద  కడుతున్న శిల్పారామం పనులను సగంలోనే ఆపేశారని అన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రి పనులు 90 శాతం పూర్తయి, 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని పూర్తి చేసే కనీస బాధ్యత లేని దుర్మార్గపు ప్రభుత్వం ఇది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు.