ఆక్రమణలపై ఉక్కుపాదం
- గండిపేటలో భారీగా కూల్చివేతలు
- 50కి పైగా షెడ్లు, డబ్బాల తొలగింపు
- కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, మియాపూర్,
- దుండిగల్ సర్కిళ్ల పరిధిలో ఆక్రమణల కూల్చివేత
- పోలీసు బందోబస్తు మధ్య స్పెషల్ డ్రైవ్
మణికొండ, జూన్ 27 (విజయక్రాంతి) : గండిపేట ప్రధాన రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రోడ్ల కుదింపుతో ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలపై వాహనదారులు, స్థానికుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులతో స్పందించిన యంత్రాంగం శనివారం భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వేసిన 50కి పైగా షెడ్లు, వ్యాపార సముదాయాల డబ్బాలను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు.ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ’99 రోజుల ప్రణాళిక’లో భాగంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద, టీపీఓ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది.
గోల్కొండ రిసార్ట్ నుంచి సాయిబాబా ఆలయం మీదుగా ఇంద్రారెడ్డి విగ్రహం వరకు, అలాగే గండి మైసమ్మ కమాన్ నుంచి యూనియన్ బ్యాంక్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. వ్యాపారులు తమ షట్టర్ల ముందు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్లను సైతం ఏమాత్రం ఉపేక్షించకుండా కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, చైన్మెన్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఆక్రమణల తొలగింపుతో ప్రధాన రోడ్లు విశాలంగా మారడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల పరిధిలో..
కూకట్‌పల్లి, జూన్ 27 (విజయక్రాంతి): కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ సర్కిల్‌ల పరిధిలోని ఫుట్‌పాత్ ఆక్రమణలను శనివారం ఉదయం మున్సిపల్ అధికారులు కూల్చేశారు. కొంతకాలంగా ఫుట్‌పాత్‌పై అక్రమంగా వ్యాపారం నిర్వహనణల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఫిర్యాదులు అధికమవడంతో శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్‌పై ఉన్న ఆక్రమణలను కూల్చేశారు.
కూకట్‌ఫల్లి సర్కిల్ పరిధి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డులోని రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వీధి వ్యాపారుల దుకాణాలను, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధి నిజాంపేట్ రోడ్‌లోని మిత్ర హిల్స్‌లో రోడ్డుపై ఆక్రమణలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలగించిన దుకాణాల స్థానంలో తిరిగి మళ్లీ ఆక్రమణలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆక్రమణదారులను హెచ్చరించారు.
మియాపూర్ సర్కిల్ పరిధిలో..
శేరిలింగంపల్లి, జూన్ 27 (విజయక్రాంతి): సీఎంసీ మియాపూర్ సర్కిల్ పరిధిలో మంజీరా పైప్లైన్ రోడ్డు ప్రాంతంలోని సీఎంసీ మియాపూర్ నుంచి హఫీజ్పేట్ ఫ్లైఓవర్ వరకు ప్రత్యేక అక్రమాల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు.హైకోర్టు ఆదేశాల మేరకు సీఎంసీ కమిషనర్ సూచనలతో మియాపూర్ సర్కిల్ డెప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటేషన్ సిబ్బంది పాల్గొని ఫుట్పాత్లు, పబ్లిక్ మార్గాలను అడ్డుకునే అక్రమ నిర్మాణాలు, షెడ్లు, డిస్ప్లే బోర్డులు తొలగించారు.
ఈ సందర్భంగా డెప్యూటీ కమిషనర్ ఫీల్ సిబ్బందికి ఇలాంటి డ్రైవ్లను నిరంతరం కొనసాగించాలని సూచించారు. పాదచారుల మార్గాలు,రోడ్డు అంచులను ఆక్రమించవద్దని ప్రజలు, వ్యాపారాలకు హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాదచారుల సురక్ష సౌకర్యం కోసం కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
దుండిగల్ సర్కిల్ పరిధిలో..
కుత్బుల్లాపూర్, జూన్ 27 (విజయక్రాంతి): నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, రహదారులను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దుండిగల్ సర్కిల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సర్కిల్ పరిధిలోని మల్లంపేట్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 4ఎ నుండి మల్లంపేట్,బాచుపల్లి మార్గంలో సుమారు 1.5 కిలోమీటర్ల మేర రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దాదాపు 32 అక్రమ ఫుడ్ స్టాల్స్ను అధికారులు గుర్తించారు.
గుర్తించిన వాటిలో ఇప్పటివరకు 24 ఆక్రమణలను విజయవంతంగా తొలగించారు.ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట మణి కరన్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రహదారులపై ఆక్రమణలను సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా రోడ్డు పక్కన వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడమే కాకుండా, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.మిగిలిన వాటిని కూడా త్వరలోనే తొలగించనున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్, టీపీఎస్ ముఖేష్ సింగ్, టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.






