5 August, 2026 | 1:55 AM

ఎంఎన్‌జే క్యాన్సర్స్ ఆసుప్రతిలో అన్నదానం

05-08-2026 12:00 AM

టీఎన్‌జీవో నేత ముజీబ్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ

నిరంతరాయంగా ఆసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సైనీ (ముజీబ్), ఆసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి వెంట ఉన్న సహాయకులకు డాక్టర్ ముజీబ్ తన స్వహస్తాలతో ఆహారాన్ని పంపిణీ చేశారు. తన తల్లిదండ్రులైన ఆసదుద్దీన్, అన్వరున్నీసా స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా, డాక్టర్ ముజీబ్ ప్రతి వారం ఆసుపత్రిలో రోగులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ అన్నదానం ఎంతో ఆసరాగా నిలుస్తోంది.

కార్యక్రమంలో టీఎన్‌జీవోఎస్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అహ్మద్, శంకర్, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్రి పాల్గొన్నారు. వీరితో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ ప్రెసిడెంట్ బి. శివకుమార్, కార్యదర్శి చంద్ర శేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్వో మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా, మహ్మద్ హబీబ్ చావుష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ,  నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులకు కడుపునిండా భోజనం పెట్టడం కంటే గొప్ప తృప్తి మరొకటి లేదన్నారు. యూనియన్ నాయకులు, సభ్యులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, ఇతర సౌకర్యాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. యూనియన్ పరంగా రోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.