ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలపై టీవీకే కేసు
- చెన్నైలోని ఉదయనిధి నివాసానికి పోలీసులు
- అరెస్ట్‌ను అడ్డుకునేందుకు డీఎంకే నేతల యత్నం.. స్వల్ప ఉద్రిక్తత
- హైడ్రామా మధ్య నిందితుడిని తంజావూరుకు తరలింపు
- అరెస్ట్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ
- న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేషన్ బెయిల్‌పై విడుదల
చెన్నై, ఆగస్టు 4: సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ అనంతరం ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే మహిళా విభాగం నేతలు సోమవారం రాత్రి తంజావూర్ పోలీసులను ఆశ్రయించగా, ఉదయనిధిపై మొత్తం తొమ్మిది సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.
పోలీసులు మంగళవారం ఉదయం చెన్నైలోని ఉదయనిధి నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద పోలీసులను అడ్డుకునేందుకు డీఎంకే నేతలు ప్రయత్నించారు. దీంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకున్నది. డీఎంకే నేతలను ఛేదించుకుని పోలీసులు ఇంటి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను ఉదయనిధి సతీమణి కిరుత్తిక అడ్డుకునే ప్రయత్నాం చేశారు. తన భర్త స్నానానికి వెళ్లారని, కాసేపు వేచిచూడాలని చెప్పారు.
ఇంట్లో పనులు పూర్తి చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు గంటపాటు ఇంట్లోనే కూర్చుకున్నారు. తర్వాత ఉదయనిధి అనేక ఫోన్‌కాల్స్‌తో ఎక్కువ సేపు సమయం గడిపారు. పోలీసులు చివరకు చొరవ తీసుకుని ఉదయనిధిని ప్రత్యేక వాహనంలో తంజావూరులోని సెంగిపట్టి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పోలీస్‌స్టేషన్‌కు పెద్దఎత్తున డీఎంకే శ్రేణులు చేరుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపైకి చెప్పులు విసిరారు. అలాగే, తంజావూరు, తిరుచ్చి, మధురైలో టీవీకే నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలుచోట్ల పోలీసులు, డీఎంకే నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో పలువురు డీఎంకే నేతలు క్షతగాత్రులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు ముందస్తుగా డీఎంకే ఎమ్మెల్యే పన్నీర్ సెల్వంతో సహా పలువురు ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
బెయిల్‌పై విడుదల
తన అరెస్ట్‌పై ఉదయనిధి ముందస్తుగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిందితుడు విచారణకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పూర్తి కాగానే ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఉదయనిధి విడుదలయ్యారు. దీంతో డీఎంకే నేతలు ఊపరి పీల్చుకున్నారు.
అరెస్టును జోక్‌గా తీసుకుంటున్నా: ఉదయనిధి
పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని జోక్‌గా తీసుకుంటున్నానని ఉదయనిధి స్టాలిన్ మీడియా ఎదుట వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. చట్టపరంగానే ఈ కేసును ఎదుర్కొంటానని తెలిపారు.
సీఎం ఒక డమ్మీ.. రీల్స్ చేసుకోవడానికి పనికొస్తారు: మాజీ సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక డమ్మీ అని, ఆయన కేవలం రీల్స్ చేసుకోవడానికే పనికొస్తారని మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. తన కుమారుడు ఉదయనిధి అరెస్ట్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. సీఎం అహంకార వైఖరి అవలంబిస్తున్నారని, అది ఎప్పటికైనా వినాశనానికే దారి తీస్తుందని నిప్పులు చెరిగారు.
కావేరీ జలాల హక్కులను సాధించడంలో, పొరుగు రాష్ర్టం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు కన్నీరు మున్నీరవుతుంటే, ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మాత్రం సినిమాలు చూస్తూ మొసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక జోకర్ క్యాబినెట్ నడుస్తోందని మండిపడ్డారు. తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఉదయనిధిని అరెస్ట్ చేశారని ఆరోపించారు.






