5 August, 2026 | 1:41 AM

సన్నాల సాగెంత?

05-08-2026 12:52 AM
  1. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీస్తున వ్యవసాయ శాఖ
  2. డీలర్ల నుంచే రైతుల వివరాల సేకరణ
  3. నమోదుకు ప్రత్యేక వెబ్‌సైట్
  4. యాప్‌లో నమోదైతేనే బోనస్  
  5. ఈ వానాకాలం నుంచే అమలు

 హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : సన్న వరి రకాల సాగు, బోనస్ చెల్లింపులో పారదర్శకత కోసం సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాల సాగు లెక్కలను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. సేకరించిన వివరాలను ఆన్‌లైన్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో జిల్లాల వారీగా  సన్నరకం వరి సాగుపై స్పష్టత రానుంది. విత్తనాల కొనుగోలు నుంచే లెక్కల వివరాలను ఎప్పటికప్పుడు డీలర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం  ఆదేశించింది.

వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఉన్న  లెక్కలతో ఇవి సరిపోలాలని, ఏ మాత్రం తేడా ఉండరాదని పేర్కొంది. డీలర్ల వద్ద కాకుండా సొంతంగా విత్తనాలు దాచుకుని సాగుచేసే రైతులు తమ పరిధిలోని ఏఈవో ద్వారా యాప్‌లో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 వానాకాలం సీజన్‌లో నిర్దేశిత ఏడు రకాల సన్నవరి పంటలకే ప్రభుత్వం బోనస్ చెల్లించనుంది. 

ఎక్కడ కొనుగోలు చేసినా జిల్లాకు వివరాలు

రైతులు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్నరకం సాగు వివరాలు పక్కాగా తెలియనున్నాయి. దుకాణాదారులు ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేస్తున్నారా?  లేదా? అనేది మండలస్థాయిలో ఏవోలు పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వరి విత్తనాల రకాలను సైతం ఆన్‌లైన్‌లో  నమోదు చేస్తారు.

విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను ఏఈవోలు పంటల నమోదులో సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో విత్తన కొనుగోలు నమోదు చేయని రైతులకు బోనస్ రాదని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో  నమోదుకు ప్రభుత్వం ప్రత్యేకంగా  వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్లు సులభంగా లాగిన్ అవ్వడానికి వీలుగా క్యూఆర్ కోడ్ సదుపాయం కూడా కల్పించింది.

విత్తన  డీలర్లు ఈ సైట్‌లో సన్నరకం వరి రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంచుకొని కొనుగోలు చేసిన రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ వంటి  ప్రాథమిక వివరాలతో పాటు విత్తనరకం, కంపెనీ పేరు, లాబ్ నెంబర్ , సీడ్ ప్యాకెట్ , సైజ్, కొనుగోలు చేసిన తేదీని ఖచ్చితంగా నమోదు చేయాలి. డిజిటల్ నమోదు ప్రక్రియ కేవలం 2026 వానాకాలం సీజన్‌లో  విక్రయించే విత్త నాలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వం విధించిన గడువు లోపలే డీలర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

ఏడు సన్న రకాలు

  1. తెలంగాణ సోన (15048)            
  2. సాంబమసూరి (బీపీటీ5204)
  3. కేఎన్‌ఎం (1638)
  4. హెచ్‌ఎంటీ సోన                   
  5. జై శ్రీరాం                                
  6. డబ్ల్యూజీ ఎల్ (44)                         
  7. కేఎన్‌ఎం (7715)