5 August, 2026 | 2:42 AM

తెలంగాణ కాంట్రాక్టర్ల కట్టు బానిసత్వం!

05-08-2026 01:30 AM

ప్రత్యేక రాష్ట్రంలోనూ దక్కని ఫలితం

ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు

సబ్ కాంట్రాక్టర్లుగా, పీస్ వర్క్ కాంట్రాక్టర్లుగా.. లేబర్ సప్లయర్లుగా తెలంగాణ కాంట్రాక్టర్లు

ఆర్థికంగా అధఃపాతాళానికి!

* ఆత్మాభిమానం పేరిట చేసిన పోరాటం తమకు అవకాశాలు కల్పిస్తుందని ఆనంద పడ్డారు.. కానీ పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది పరిస్థితి. ఇదీ తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్ల ఆవేదన. సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రజలు.. ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అప్పట్లో ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉన్న తెలంగాణ కాంట్రాక్టర్లు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత అందరితోపాటు తమకూ మంచిరోజులు వస్తాయని ఆశించారు.

అయితే గడిచిన పుష్కర కాలంలో వారి ఆశలు అడిఆశలయ్యాయి. గతంలోని పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. సొంత రాష్ట్రంలో ప్రభుత్వాలకు తెలంగాణ కాంట్రాక్టర్లు పరాయివారే అయ్యారని వాపోతున్నారు. సూటిగా చెప్పాలంటే.. సమైక్య రాష్ట్రంలోని పరిస్థితి కంటే మరింత అధ్వానంగా తయారయిందని లోలోపల కుమిలిపోతున్నారు. తమ ఆర్థిక పరిస్థితి, తమ కుటుంబ పరిస్థితి, తమ కాంట్రాక్టుల పరిస్థితిని తలుచుకుంటూ వాపోతున్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందే నిధులు, నీళ్ళు, నియామకాలకు తోడు ఆత్మాభిమానం అనే నినాదాలతో. తెలంగాణ లోని కాంట్రాక్టర్లు ఇందుకు మినహాయింపేమీ కాదు. పేరుకే తెలంగాణ కాంట్రాక్టర్లు కానీ.. ప్రాజెక్టులు, పనులు అన్నీ కూడా ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకే దక్కేవి. వందకు నాలుగైదు ప్రాజెక్టులు అవికూడా.. చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే సమైక్య ప్రభుత్వంలోని నేత లు విదిల్చేవారు.

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. కావాలనే ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేవారు. అవసరం అయితే టెండరు నిబంధనలనే మార్చివేసి ఆంధ్రా బడా కాంట్రా క్టర్లకు అనుకూలంగా మలుచుకునేవారు. తెలంగాణలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లదే హవా. ప్రభుత్వ పాలకులను బతిమాలి.. బామాలి చిన్నా చిత కా కాంట్రాక్టులు మాత్రం తెచ్చుకునే అవకాశం ఉండేది. దయ తలిస్తే బిల్లులు మంజూరు అయ్యేది.

సూటిగా చెప్పాలంటే, బానిసలుగానే తమను చూసేవారని తెలంగాణ కాంట్రాక్టర్లు అప్పటి రోజులను తలుచుకుని కుమిలిపోయేవారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి కాంట్రాక్టర్లు బహిరంగంగా మద్దతు తెలిపారు. తెలంగాణ వస్తే.. తమ బతుకులు, పనులు మారుతాయని, తెలంగాణ పునర్నిర్మాణంలో తామూ భాగస్వాములమయ్యే అవకా శం దక్కుతుందని వారు ఆశించారు. సొంత రాష్ట్రంలో జరిగే పనులకు సంబ ంధించిన కాంట్రాక్టుల్లో తమకు సింహభాగం దక్కుతుందని ఆకాంక్షించారు.

సొంత రాష్ట్రంలో.. పొయ్యిలోకి..

నాలుగు కోట్ల తెలంగాణవాసుల కల నెరవేరి పుష్కర కాలం అయ్యింది. ప్రభుత్వాలు మారాయి. కానీ తెలంగాణ కాంట్రాక్టర్ల తలరాత మాత్రం మారలేదని వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గడిచిన పన్నెండు సంవత్స రాలుగా రూ. లక్షల కోట్ల ప్రాజెక్టులను తెలంగాణ వ్యాప్తంగా చేపట్టారు. అయితే తెలంగాణ నేతలు, ప్రభుత్వాలు మాత్రం ఎప్పటిమాదిరిగానే ఆంధ్రా కాంట్రాక్టర్లకే పెద్దపీట వేయడంపై తెలంగాణ కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో కనీసం చిన్నా చితకా పనులన్నా దక్కేవి. ఇప్పుడు అవికూడా దక్కకపోవడంతో, తాము పెనంమీది నుంచి పొయ్యిలోకి పడ్డట్టయ్యిందని కాం ట్రాక్టర్లు కుమిలిపోతున్నారు.

ఆంధ్రా కాంట్రాక్టర్లకే అనుకూలంగా..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతకూడా కాంట్రాక్టు పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే దక్కడం వెనుక.. టెండరు నిబంధనల్లో పూర్తిగా మార్పు తీసుకురావడమే తమ కడుపులను కొట్టేందుకు శ్రీకారం చుట్టినట్టయ్యిందని వా రంటున్నారు. కేవలం ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా.. ఇతర కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేసేలా నిబంధనలను రూపొందిస్తున్నారని, దీనితో కనీసం తాము అర్హతకూడా సాధించడం లేదంటూ వారు లబోదిబోమంటున్నారు.

ఇలా కాంట్రాక్టులు రాకుండా చేయ డంతో.. ఇన్నేళ్ళుగా నిర్మించుకున్న తమ కాంట్రాక్టు సౌధా లు కూలిపోతున్నాయంటున్నారు. తమ అర్హతలు, బ్యాంకు పరిమితులు, టర్నోవర్, దృఢంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అన్నీకూడా ఒక్కొక్కటి కూలిపోతున్నాయని వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీనితో ఎట్టకేలకు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు దివాళా తీయాల్సిన పరిస్థితి ఎదుర్కోవడంతో.. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని వారంటున్నారు.

కట్టు బానిసలుగా..

సమైక్య రాష్ట్రంలో పనులు, ప్రాజెక్టులను అడుక్కున్నప్పటికీ.. బానిసలుగానైనా.. కొంత గౌరవం ఉండేదని.. కానీ సొంత రాష్ట్రంలో కట్టు బానిసలుగా ఆంధ్రా బడా కాంట్రాక్టర్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఒకటీ.. అరా పనులనుకూడా తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదు. ఇక్కడి ప్రభుత్వంపై ఆంధ్రా కాంట్రాక్టర్లే అజమాయిషీ చేస్తుండటంతో.. వారు చెప్పిందే వేదంలా మారింది. ఎంగిలి మెతుకుల కోసం వేచిచూసే పరిస్థితి దాపురించిందని మౌనంగా రోదిస్తున్నారు. 

తెలంగాణలో తమకుకూడా బడా బడా కాంట్రాక్టులు చేసే అవకాశం దక్కుతుందని భావించిన తెలంగాణ కాంట్రాక్టర్లకు శృంగభంగమే ఎదురవుతోంది. పుష్కర కాలంగాకూడా ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులన్నీ ఇస్తుండటంతో.. తెలంగాణ కాంట్రాక్టర్లు కేవలం.. వారి నుంచి పనులు తీసుకుని.. సబ్ కాంట్రాక్టులుగా, పీస్ వర్కర్లుగా, లేబర్ సప్లయర్స్‌గా మారాల్సి రావడం తమ దౌర్భాగ్యమని వారంటున్నారు.

సమైక్య రాష్ట్రంలో కొద్ది వెలుగు వెలిగిన తెలంగాణ కాంట్రాక్టర్లుకూడా నేడు సొంత రాష్ట్రంలో మరింత దిగజారాల్సి వస్తోంది. ఆంధ్రా బడా కాంట్రాక్టర్ల చెప్పు చేతుల్లో పనులు చేస్తూ.. ఆర్థికంగా కూడా దివాళా తీయాల్సివస్తోంది. సబ్ కాంట్రాక్టు పనులు చేసి, పీస్ వర్కర్లుగా మారి, లేబర్ సప్లయర్లుగా పనిచేసినా.. బిల్లుల కోసం ఆంధ్రా బడా కాంట్రాక్టర్ల వద్దకు వెళితే.. పీఏలు, అసిస్టెంట్లతో మాట్లాడించి.. గంటల గంటలు వేచిచూసేలా చేస్తూ.. తెలంగాణ ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారంటూ వారు వాపోతున్నారు.

అంతా భరించి వేచిచూసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకుండా వేధిస్తూ.. ఆర్థికంగా మరింత చితికిపోయేలా వ్యవహరిస్తున్నారంటూ తలలు బాదుకుంటున్నారు. అటు పనులు లేక.. ఇటు చేసినవాటికి బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో.. ఆర్థికంగా దెబ్బతిం టూ.. పలువురు ఆత్మహత్యలకుకూడా పాల్పడిన సంఘటనలన తెలంగాణ కాంట్రాక్టర్లు జ్ఞప్తికి తెచ్చుకుని విలపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం కూడా తీవ్రంగా కష్టాలపాలవుతున్నామని, ఆడ బిడ్డలకు పెండ్లిల్లుకూడా చేయలేని కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారని వారు వాపోతున్నారు. 

తెలంగాణ వస్తే.. లాభమా.. నష్టమా..

తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకు లాభం కలుగుతుందని, తమ రాష్ట్రంలో సొం తంగా పనులు చేసుకోగలుగుతామని కాంట్రాక్టర్లందరూ భావించారు. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి కనపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం.. బడా ఆంధ్రా కాంట్రా క్టరుకు దాసోహం అవుతూ వస్తోంది. దీనితో ఇలాంటి తెలంగాణ కోసమా తాము అనాడు ఉద్యమానికి మద్దత్తుగా నిలిచిందంటూ విలపిస్తున్నారు. తమను, తమ ఆర్థిక బలాన్ని, కాంట్రాక్టరుగా రికార్డును చెరిపేస్తూ.. తమ ను బానిసలకంటే హీనంగా దేహీ అంటూ అడుక్కునేలా మార్చుతున్న బడా కాంట్రాక్టరు కనుసన్నల్లో ఉన్న ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.

ఆంధ్రా బడా కాంట్రాక్టరు చేతిలో చక్రం..

నిజానికి గడిచిన పుష్కర కాలం నుం చికూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా కు చెందిన ఒక బడా కాంట్రాక్టరు కనుసైగల్లోనే పనులను కేటాయిస్తూ వస్తున్నారని తెలంగాణ కాంట్రాక్టర్లు లబోదిబో మం టున్నారు. ఎవరికి ఎంత పని ఇవ్వాలి.. ఎంత వ్యాల్యూ ఉన్న పని ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు నిధు లు విడుదల చేయాలనేదికూడా సదరు బడా కాంట్రాక్టరే నిర్దేశిస్తున్నారని వారు వాపోతున్నారు.

అందరి నుంచి మా మూళ్లు వసూలు చేసి సదరు బడా కాం ట్రాక్టరే ప్రభుత్వ పెద్దలకు, పార్టీలకు అం దిస్తుండటంతో.. బడా నేతలుకూడా సదరు కాంట్రాక్టరు చెప్పుచేతుల్లోనే ప నులు చేస్తున్నారు. నిధులు విడుదలైనా.. ఆంధ్రాకు చెందిన బడా కాంట్రా క్టరుకే పూర్తి నిధులు అందిస్తూ.. ఒకటీ.. అరా మాత్రం ఇతరులకు కేటాయిస్తుండటంతో.. అన్ని రకాల కాంట్రాక్ట ర్లు పూర్తిగా ఆర్థిక బానిసత్వానికి గురవ్వక తప్పడం లేదంటున్నారు. 

పరిస్థితి మారాలి.. 

ఇలాంటి పరిస్థితిని, ప్రభుత్వం తీరును మారాల్సిన అవసరం ఉందని.. మార్చాల్సిన బాధ్యతకూడా ప్రజలపై ఉందని తెలంగాణ కాంట్రాక్టర్లు వేడుకుం టున్నా రు. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే.. మరో ఉద్యమం తప్పదంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం తెలంగాణది.. ఉద్యమ కష్టం తెలంగాణ ప్రజలది.. అమరుల య్యింది తెలంగాణ బిడ్డలు.. సొంత రాష్ట్రంలో కష్టాల పాలవుతున్నదికూడా తెలంగాణ ప్రజలే అంటూ వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఫలితాలను తెలంగాణ ప్రజలు అనుభవించకుండా.. పక్కరాష్ట్రం బడా కాంట్రాక్టర్లు అనుభవించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో భారీ ఆస్థులు సంపాదించిందికూడా ఆంధ్రా కాంట్రాక్టర్లే. పెద్దపెద్ద హోటళ్లు, బడా ఆసుపత్రులు, మీడియా, ప్యాలెస్‌లు.. ఇలా ఏది చూసుకున్నా ఆంధ్రా వారిదే పెత్తనం. మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ వారి గుప్పిట్లోనే ఉండిపోవాల్సి వస్తోందంటూ ఆగ్రహం చెందుతున్నారు.

ఇప్పటికైనా పాలకు లు పరిస్థితిని గమనించి, పద్ధతులను మార్చాలని వారు కోరుతున్నారు. తెలంగాణ మట్టిలో.. తెలంగాణ రాజ్యంలో.. తెలంగాణ ప్రజలకు, వ్యాపారులకు, కాం ట్రాక్టర్లకు చేతిలో చిప్ప మాత్రమే మిగలడంపై అందరూ ఆలోచించాలని కోరుతున్నారు. స్వరాష్ట్రంలో.. సొంత ప్రజలే బానిసలుగా బతకాల్సి వస్తోంది. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు. అమరవీరులకు ఇదే నా మనమిచ్చే నివాళి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రాకు చెందిన బడా కాంట్రాక్టరు కట్టిన ప్రాజెక్టులు కూ లిపోయినా.. ఎవరూ ప్రశ్నించడం లేదు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన ప్రభుత్వమే ఎర్ర తివాచీ పరిచి.. మరిన్ని ప్రాజెక్టులను అప్పగిస్తోంది. పార్టీలు, నేతలు మాత్రం బడా కాంట్రాక్టరు నుంచి విరాళాలు తీసుకుంటున్నాయి.

తెలంగాణ ఎటుపోతోంది. ఈ అన్యాయానికి అడ్డూ.. అదుపూ లేదా అంటూ తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే.. జెన్ జీ తరహాలో ఉద్యమం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అన్నింటినీ తెలంగాణ జెన్‌జీలు గ మనిస్తున్నా రని.. ఢిల్లీ తరహాలో వీధుల్లోకి వచ్చేవరకు చూడొద్దని.. ఈ బానిసత్వానికి ఫుల్‌స్టాప్ పెట్టి, ప్రభుత్వం.. తెలంగాణపక్షాన నిలవాలని వారు కోరుతున్నారు. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి