5 August, 2026 | 2:40 AM

వాతావరణ అనుకూల సాగుతో అధిక దిగుబడులు

05-08-2026 01:53 AM

ముల్కనూరు కూరగాయల రైతులకు ఉద్యాన విశ్వవిద్యాలయం శిక్షణ

గజ్వేల్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగులోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, ముల్కనూరు కో-ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ సహకారంతో ముల్కనూరు ప్రాంత కూరగాయల రైతులకు ‘వాతావరణ మార్పులకు తట్టుకునే కూరగాయల సాగు సాంకేతికతలు‘ అంశంపై ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రొఫెసర్ డా. వి. సుచిత్ర స్వాగతం పలకగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. చంద్రశేఖర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగులో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు, నాణ్యమైన నారుమడి తయారీ, కోత అనంతర నిర్వహణ, పురుగులుతెగుళ్ల గుర్తింపు, నివారణ చర్యలపై రైతులకు నిపుణులు అవగాహన కల్పించారు. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డా. జె. శ్రీనివాస్ ఎల్నినో పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలను వివరించారు.

పరిశోధకులు శ్రీమతి కె. నిరోష నాణ్యమైన నారుమడి తయారీ, శ్రీమతి ఎ.వి.ఎన్. లావణ్య కోత అనంతర నిర్వహణపై శిక్షణ ఇవ్వగా, డా. వి. సురేష్ కూరగాయల పంటల్లో పురుగులు, వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం రైతులను క్షీరసాగర్ దత్తత గ్రామంలోని క్షేత్ర ప్రదర్శనకు తీసుకెళ్లి వాతావరణ అనుకూల కూరగాయల సాగు విధానాలను ప్రత్యక్షంగా చూపించారు. శాస్త్రవేత్తలతో రైతులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముగింపు సందర్భంగా రైతుల అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడిందని రైతులు విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.