5 March, 2026 | 5:32 AM

గల్ఫ్ లో మంటలు

05-03-2026 02:23 AM
  1. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ భారీ దాడులు
  2. ఇజ్రాయెల్‌లో సురక్షితంగా ఉన్నాం: విజయక్రాంతితో తెలంగాణ ప్రవాసీలు

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ గల్ఫ్ దేశాలపై భారీఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారంగా దాడులను ముమ్మరం చేసింది. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓడపై దాడి చేసింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్ర తరం చేసింది. ఇజ్రాయెల్ సైనిక దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి. ఆకాశం నుంచి నిరంతరాయంగా వస్తున్న క్షిపణులు, డ్రోన్ల ధాటికి లెబనాన్ రాజధాని నగరం బీరుట్ కంపించిపోయింది. లెబనాన్‌పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో 120 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ గురి

క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు

ముగ్గురు మృతి.. 58 మందికి పైగా గాయాలు

అబుదాబి, దుబాయ్, దోహా వంటి ప్రధాన నగరాల్లో హైఅలర్ట్

టెహ్రాన్, మార్చి 4 : పశ్చిమాసియాలో ఐదోరోజూ యుద్ధ జ్వాలలు కొనసాగుతున్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ తన పొరుగున ఉన్న పలు గల్ఫ్ దేశాలపై భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ సాహసోపేతమైన చర్యకు దిగింది.

గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడు లు జరిగాయి. దీంతో అబుదాబి, దుబాయ్, దోహా వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో దాదాపు డజ ను మంది, ఆరుగురు యూఎస్ సైనికులు మరణించారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఓడను ఇరాన్ దాడి చేసింది. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై డ్రోన్లు..

ఇరాన్ దాడుల తీవ్రత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. దుబాయ్‌లోని అమెరికాకాన్సులేట్, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్‌హోటల్ పరిసరాల్లో కూడా డ్రోన్ల దాడులు జరిగాయి. యూఏఈ రక్షణ వ్యవస్థలు సుమారు 186 బాలిస్టిక్ క్షిపణులను, 800 కు పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ముగ్గురు పౌరు లు , 58 మందికి పైగా గాయపడ్డారు.

ఖతార్, కువైట్

ఖతార్‌లోని అల్-ఉదైద్ అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఖతార్ రక్షణ వ్యవస్థలు ఒక క్షిపణిని గాలిలోనే అడ్డుకోగా, మరో క్షిపణి బేస్ సమీపంలో పడింది. ఇక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతినడంతో కువైట్ ప్రభుత్వం భద్రతను పెంచింది.

బహ్రెయిన్, ఒమన్

బహ్రెయిన్‌లో ఉన్న బ్రిటన్, అమెరికా నౌకాదళ స్థావరాలను సైతం ఇరాన్ వదిలిపెట్టలేదు. ఇక్కడ డ్రోన్ల ద్వారా నిరంతర దాడులు జరుగుతుండటంతో గల్ఫ్ సముద్ర ప్రాంతం అట్టుడుకుతోంది. శాంతి చర్చలకు వేదికగా ఉండే ఒమన్ పైన కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేయడం ఈ యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో నౌకాయానాన్ని నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఐఆర్జీసీ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం

ఇరాన్ రివల్యూషనరీ గారడ్స్ (ఐఆర్జీసీ) ఇతర దేశాల్లోని లక్ష్యాలపై బుధవారం తెల్లవారుజాము నుంచి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్, జెరూసలేం నగరాలను లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయో గించింది. ఈ దాడుల ధాటికి ఇజ్రాయెల్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు.  సుమారు 230 ఆత్మహుతి డ్రోన్లను యుద్ధ రంగంలోకి దించి ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలకు ఇరాన్ సవాల్ విసురుతోంది.

సౌదీ అరేబియాపై..

సౌదీ అరేబియాలోని కీలక చము రు శుద్ధి కర్మాగారమైన రాస్ తనూరాపై ఇరాన్‌డ్రోన్ల ద్వారా విరుచుకు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద చము రు ఎగుమతి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంపై దాడులు జరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కలవరపెడుతోంది. క్షిపణి దాడుల భయంతో రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సరిహద్దు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు పడటంతో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌లో సురక్షితంగా ఉన్నాం 

విజయక్రాంతితో  తెలంగాణ ప్రవాసీలు 

మేడ్చల్, మార్చి 4 (విజయక్రాంతి): ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రవాసుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ నుంచి లక్షలాది మంది గల్ఫ్, ఇజ్రాయిల్ తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. తమ వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రవాసులు విజయక్రాంతితో ఫోన్‌లో మాట్లాడారు.

ఇజ్రాయిల్‌లో ఉన్న తెలంగాణ వారందరూ సురక్షితంగా ఉన్నారని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన బొమ్మకంటి మహేష్‌గౌడ్ తెలిపారు. క్షిపణి దాడి జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రభుత్వం సైరన్ మోగించి అప్రమత్తం చేస్తుందని, దీంతో తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఇక్కడ క్షిపణుల దాడిని ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానని అన్నారు.  క్షిపణులను ఇజ్రాయెల్ మిలటరీ అడ్డుకుంటుందని, వందలో ఒకటి మాత్రమే పడుతో ందన్నారు.

ఇక్కడ ప్రతిఇంటికి బంకర్ ఉంద ని, సైరన్ మోగగానే అందులోకి వెళ్తామన్నారు. భూగర్భ రైల్వేస్టేషన్‌లు ఉంటాయని, అందులోకి కూడా వెళ్తామని మహేష్‌గౌడ్ తెలిపారు. తాము టెల్ అవివ్ నగరంలో ఉం టున్నామన్నారు. మేము క్షేమంగా, ఉన్నామని, తెలంగాణలో తమ కుటుంబాల వారు ఆందోళన చెందవద్దని చెప్పారు.