రైతు వేదికలో రైతు వారోత్సవాలు..!
కొల్చారం: గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులకు పంటల సాగులో వచ్చుచున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్షులు రవితేజ రెడ్డి అన్నారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం నుండి ప్రారంభమైన రైతు ఉత్సవాలలో పైతర రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల పెట్టుబడు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయి అన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్ సాగు చేయడంతో పాటు పామ్ ఆయిల్ లో అంతర పంటల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి పామాయిల్ సాగు పెంపొందించాలన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష రిపోర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ సర్పంచులు భాను ప్రకాష్ రెడ్డి, ఎల్లయ్య, తుక్కాపూర్ ఉపసర్పంచ్ ఆరె రవీందర్, జి పి ఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






