28 June, 2026 | 1:33 AM

వెండి తెరపై నల్లని నీడలు

28-06-2026 12:31 AM

జ్ఞాపకాలుగా గ్రామీణ సినిమా హాళ్లు

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సినిమా హాళ్లు మారుతున్న ఆధునిక కాలంతో పోటీ పడలేక మూసివేతకు గురవుతున్నాయి. నాటి సినిమా టాకీస్‌లు ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎక్కడో చోట మినహా అనేక సంవత్సరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు వినోదాన్ని పంచిన సింగిల్ స్క్రీన్ పూర్తిగా కనిపించని పరిస్థితి తలెత్తుతోంది. పన్నుల భారం, నిర్వహణ ఖర్చు, ముఖ్యంగా ప్రేక్షకుల నిరాదరణతో గ్రామీణ ప్రాంతాల్లోని సినిమా హాళ్లు మూతపడుతున్నాయి. 

(విజయక్రాంతి, మహబూబాబాద్): ఒకప్పుడు హౌస్ ఫుల్ కలెక్షన్లతో.. పండగ వాతావరణం కనిపించే సినిమా హాళ్లు ఇప్పుడు కొన్ని గోదాములు, ఫంక్షన్ హాళ్లు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. కొత్త సినిమా విడుదలైందంటే చాలు గ్రామమంతా టాకీస్ వైపు కదిలేది. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సినిమాను ఒక వేడుకగా చూసే పరిస్థితి ఉండేది. సినిమా చూసిన తర్వాత అందులోని సారాంశాన్ని, సినిమా తీసిన కథనాన్ని ప్రత్యేకంగా చర్చించుకునేవారు.

ఆధ్యాత్మిక, భక్తి సంబంధమైన, సాంఘిక, పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథాంశమైన చిత్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని సినిమా హాళ్లలో అనేకం శత దినోత్సవ వేడుకలు కూడా జరుపుకునేవి. మారిన నాగరిక ప్రపంచం, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిపోవడంతో సినిమా హాళ్లపై పెద్ద ఎఫెక్ట్ చూపింది. టెలివిజన్‌తో కొంత, డిష్ ఆంటినాలతో మరికొంత, తాజాగా సెల్‌ఫోన్లు, ఓటీటీ యాప్‌లతో గ్రామీణ ప్రాంత సినిమా ప్రపంచం పూర్తిగా కుదేలయ్యింది.

సినిమా హాలును ఆసరాగా చేసుకుని అనేక మంది జీవనం సాగించే పరిస్థితి ఉండగా ఇప్పుడు వారి జీవన చిత్రం కూడా పూర్తిగా మారిపోయింది. 1980 నుంచి 2000 సంవత్స రానికి వరకు గ్రామాల్లో వినోదాన్ని పంచి ప్రేక్షకులతో కళకళలాడిన అనేక సినిమా హాళ్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతూ, చాలా వరకు శిథిలావస్థకు చేరుకొని వెండితెర వెలుగులు పంచిన నాటి సినిమా హాళ్లు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కు పైగా సిని మా హాళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. టికెట్ల కోసం భారీ క్యూలు, ప్రేక్షకుల సందడితో కళకళలాడిన ప్రాంగణాలు పూర్తిగా ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

నగరాల్లో మల్టీప్లెక్స్  థియేటర్లలో అందిస్తున్న మెరుగైన సౌకర్యాలు, ఏసీ, ఇతర ఆధునిక సౌండ్ సిస్టం గ్రామీణ ప్రాంతాల్లోని సినిమా హాళ్లలో ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకోవడంతో వాటి నిర్వహణ భారంగా మార డం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, ప్రేక్షకుల ఆదరణ పూర్తిగా తగ్గిపో వడం, నిర్వహణ ఖర్చు పెరిగిపోవడం, సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు, ఆర్థిక సమస్యలతో అనేకమంది గ్రామీణ ప్రాంతా సినిమా హాళ్ల యజమానులు మూసి వేయడానికే మొగ్గు చూపుతున్నారు. 

 బండి సంపత్‌కుమార్,