కలెక్టరేట్‌లో కూరగాయల అంగడి!
హనుమంతరెడ్డి (మేడ్చల్, విజయక్రాంతి): కలెక్టర్ కార్యాలయం పాలనకు కేంద్ర బిందువు. జిల్లా పాలన అంతా అక్కడి నుంచే జరుగుతుంది. కానీ మేడ్చల్ కలెక్టరేట్‌కు వివిధ పనుల మీద వచ్చిన వారు లోపల అడుగుపెట్టగానే కూరగాయల విక్రయాలు కనిపిస్తాయి. కలెక్టరేట్‌లో కూరగా యలు విక్రయించడం ఏమిటని ఒకింత ఆశ్చర్యం కలిగినా, ఆ తర్వాత వారెవ్వా అనిపిస్తుంది. కలెక్టరేట్‌కు రెండు, మూడు కిలోమీటర్ల వరకు ఒక్క నివాస గృహం లేదు.
అయినప్పటికీ ఇక్కడ మంచి వ్యా పారం జరుగుతోంది. ఏడాది క్రితం మొదట ఇద్దరు మహిళలు ప్రయోగాత్మకంగా కూరగాయల విక్రయం ప్రారంభించగా, మంచి వ్యాపారం జరగడంతో ప్రస్తుతం ఆరుగురు మహిళలు వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో ఉం డడం వల్ల ఇంటికి వెళ్లే సమయంలో కూరగాయలు తీసుకెళ్తారని ఉద్దేశంతో మొదట ఇక్కడ విక్రయాలు ప్రారంభించారు.
తాజా కూరగాయలు కావడంతో ఉద్యోగినులతో పాటు, కలెక్టరేట్‌కు వివిధ పనుల మీద వచ్చిన వారు కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రతి సోమ వారం ప్రజావాణికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారిలో చాలామంది కూరగాయలు, పండ్లు, స్నాక్స్ కొంటున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద అధికారులు ఇక్కడ పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అను మతినిచ్చారు. మొదట్లో పరిపాలన భవనం వద్ద బయట కూరగాయలు విక్రయించేవారు.
ఆ తర్వాత కార్యాలయంలో లోపల స్టాల్స్ ఏర్పాటు చేయించారు. కొందరు మహిళలు కూరగాయలు విక్రయిస్తుండగా, ఇద్దరూ పండ్లు, ఒకరు స్నాక్స్ ఐటమ్స్ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మహిళలు కూరగాయలు విక్రయించడానికి గతంలో ఆల్వాల్ వెళ్లే వారు. కానీ ప్రస్తుతం వారు ఇక్కడే విక్రయించుకోగలుగుతున్నారు.
తాజా కూరగాయలు
కలెక్టరేట్ కు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మహిళలు కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. తోటలో నుంచి నేరుగా విక్రయానికి తీసుకొస్తున్నారు. దీంతో కూరగాయ లు తాజాగా ఉంటున్నాయి. కూరగా యలు, పండ్లు బహిరంగ మార్కెట్ ధరకే విక్రయిస్తున్నారు. ధరలో, తూకంలో ఎలాం టి మోసాలు లేవు. ఒక మహిళ ఇంట్లో తయారుచేసిన లడ్డూలు, అరిసెలు, ఇతర స్నాక్స్ విక్రయిస్తోంది. ఉడకబెట్టిన పల్లీలు, శనగలు, పెసర్లు, మక్కల తోపాటు క్యారెట్, బీట్రూట్ ముక్కలు ఒక ప్యాకెట్ లో పెట్టి విక్రయిస్తుంది. మేడ్చల్ కలెక్టరేట్లో అధికారు లు చేసిన ప్రయోగం సత్ఫలితాలనుస్తోంది.
4 వేల గిరాకీ అవుతోంది
నేను సీజనల్ పండ్లు విక్ర యిస్తాను. ప్రతిరోజు రూ.4 వేల గిరాకీ అవుతోం ది. సోమవారం 5 వేల వరకు అవుతుంది. విక్రయాలు బాగానే జరుగు తున్నాయి. ఆదివారం కలెక్టరేట్ బం ద్ ఉండటం వల్ల రింగ్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్డులో పండ్లు విక్రయిస్తాను. అక్కడ కూడా ఇంతే గిరాకీ అవుతుంది. జ్యోతి, ఉప్పరపల్లి
మా తోటలో పండినవే అమ్ముతా
తోటలో పండిన కూరగాయ లు ఏ రోజుది ఆ రోజే విక్రయానికి తీసుకొస్తాను. తాజాగా ఉండడం వల్ల బాగానే వ్యాపారం జరుగుతోంది. ప్రతిరోజు రూ.2500 వరకు విక్రయిస్తాను. సోమవారం రూ.3 వేల గిరాకీ అవుతుంది.
రేఖ, ఉప్పరపల్లి
ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ విక్రయిస్తాను
ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ విక్రయిస్తాను. లడ్డూలు, అరిసెలు, ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే తయారు చేస్తాను. శనగలు, పల్లీలు, మొక్కలు, పెసర్లు ఉడకబెట్టి వీటితోపాటు క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసి ప్యాకెట్లు విక్రయిస్తాను. నెలరోజుల క్రితమే స్టాల్ ఏర్పాటు చేశాను. గిట్టుబాటు అవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు రూ.2 వేల గిరాకీ అవుతుంది.
హారిక, ఉప్పరపల్లి
పొదుపు సంఘాల్లో ఉన్న వారికే అవకాశం
పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకే స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము. వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. సొంతంగా పండించిన తాజా కూరగాయలు విక్రయిస్తున్నారు. మహిళా సంఘాలు తయారుచేసిన స్నాక్స్ ఐటమ్స్ ని క్యాంటీన్లో, స్టార్ లో విక్రయిస్తున్నారు. సెక్రటేరియట్ లో మేడ్చల్ మహిళా సంఘం వారు క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. మహిళలకు ఉపాధి కల్పించడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం.
డీఆర్డీవో సాంబశివరావు






