శివాలయంలో బ్రహ్మ
హనుమకొండ బస్టాండ్ దగ్గర, రాజరాజనరేంద్ర భాషానిలయం గ్రంథాలయం పక్కన బ్రాహ్మణవాడలో శివాలయమున్నది. ఆ శివాలయమొక దేవాలయాల ప్రాంగణం. శివాలయంలో కాకతీయశైలి అధిష్టానపీఠం మీద శివలింగం ప్రతిష్టించివున్నది. అదొక చిన్నగుడి. అటువంటి చిన్న, చిన్న గుడులున్నాయక్కడ. శివాలయంలోని ఒక గూటిలో బ్రహ్మ శిల్పమున్నది. ఆ ఒక్క శిల్పమే అక్కడెందుకున్నదో ఏ ఆధారం లభించలేదు.
బ్రహ్మకు మూడు ముఖాలే కనిపిస్తున్నాయి. అర్ధ శిల్పం కనుక నాలుగవ ముఖం వెనుక వైపున ఉండిపోయింది. చతుర్భుజుడైన బ్రహ్మ పరహస్తాలలో యాగంలో హవిస్సులర్పించే సృక్, పాశం, నిజహస్తాలలో ఒక తంత్రీవాద్యం (వీణ) ధరించి, వాయిస్తున్నాడు. హార, గ్రైవేయకాలు, మేఖల, ఉరుడాలు, జయమాల, వక్షబంధం, కేయూరాలు, కరకంకణాలు, పాదమంజీరాలు ఆహార్యంగా ఉన్న బ్రహ్మ వైతస్తిక పాదంతో త్రిభంగిమలో నిల్చున్నాడు.
అతనికి ఎడమవైపున చతుర్భుజురాలు, అంకుశం, పాశం, వీణతో హంసవాహనంతో సరస్వతి చిన్న శిల్పం చెక్కివున్నది. ఆమెకు ఎడమవైపున చామరగ్రాహిణి నిలబడివున్నది. బ్రహ్మకు కుడివైపున తాళం వాయిస్తు, వాద్యసహకారం అందిస్తు నిలబడిన మరొక స్త్రీ శిల్పమున్నది. దేవదంపతులుగా కొలువబడే బ్రహ్మ, సరస్వతిలిద్దరు వీణాధరులుగా కనిపించడం అత్యంత అరుదైన సాంస్కృతిక రూపం. బ్రహ్మ శిల్పం వెనుక అర్ధవృత్తాకారపు తోరణం తట్టుగా చెక్కబడివున్నది.
ఇంతటి అపురూపమైన, అరుదైన శిల్పం తనదికాని తావున ఒక గూటి విగ్రహంగా మిగిలిపోయింది. శైలిని బట్టి ఈ శిల్పం చాళుక్యుల కాలానికి చెందింది. పోలికలో హళేబీడు బ్రహ్మలెక్క అగుపిస్తున్నాడు. ఆహార్యంతో కర్ణాటకలోని బ్రహ్మజినాలయంలోని బ్రహ్మవలె వున్నాడు






