4 May, 2026 | 7:02 PM

రైతు వారోత్సవానికి రైతులు దూరం… వెలవెలబోయిన రైతు వేదిక

04-05-2026 05:48 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవం నిరుత్సాహకరంగా సాగింది. రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే రైతులు హాజరుకావడంతో వేదిక వెలవెలబోయింది. ముందస్తుగా ప్రచారం నిర్వహించినప్పటికీ రైతుల స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కార్యక్రమానికి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది హాజరైనప్పటికీ రైతుల గైర్హాజరీ కారణంగా అసలు ఉద్దేశ్యం నెరవేరలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సంబంధించిన పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఖాళీ కుర్చీల మధ్య సాగడం విచారకరంగా నిలిచింది. రైతులు హాజరు కాకపోవడానికి సరైన సమాచారం అందకపోవడం, సమయ అసౌకర్యం వంటి అంశాలు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు రైతుల భాగస్వామ్యం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు