29 June, 2026 | 3:16 AM

కల్వకుర్తికి వందకోట్ల ప్రగతి రోడ్డు

29-06-2026 02:07 AM

రూ. 100 కోట్లతో 160 కి.మీ. మేర బీటీ రోడ్ల పునర్నిర్మాణం

ఫలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి భగీరథ ప్రయత్నం 

రంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో మరో చారిత్రక ముందడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న గ్రామీణ రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హామ్ (హాబిటేషన్స్ అండ్ ఆక్సిస్సిబిలిటీ మాపింగ్) ప్రథమ దశలో కల్వకుర్తికి భారీ స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. మారుమూల గ్రామాలను సైతం ప్రధాన రహదారులతో అను సంధానించడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంది.

ఎమ్మెల్యే కశిరెడ్డి నిరంతర కృషి

ఈ నిధుల మంజూరు వెనుక ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అకుంఠిత దీక్ష, నిరంతర చొరవ దాగి ఉన్నాయి. ప్రభుత్వ స్థాయి లో సీఎం రేవంత్ రెడ్డిని, సంబంధిత శాఖల మంత్రులను ప్రత్యేకంగా కలిసి నియోజకవర్గ రోడ్ల దుస్థితిని వివరించి, సరైన ప్రతి పాదనలతో నిరంతరం ఫాలోఅప్ చేయడం వల్లే ఈ భారీ ప్రాజెక్టు కల్వకుర్తిని వరించిం ది. నియోజకవర్గ అభ్యున్నతిపై ఆయనకున్న నిబద్ధతకు ఈ నిధుల సాధనే నిదర్శనం.

భారీ కేటాయింపు: 

రోడ్ల నిర్మాణం మరియు పునర్నిర్మాణం కోసం దాదాపు రూ. 100 కోట్ల నిధులు కే టాయించారు.నియోజకవర్గం లో ని కర్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల వెల్దండ,కల్వకుర్తి మండలాల్లో  పంచాయతీరాజ్ మరియు రోడ్లు & భవనాల  శాఖల పరిధిలో మొత్తం 28 ప్రధాన బీటీ రోడ్ల పనులకు అనుమతులు లభించాయి. దశాబ్దాలుగా గుంతలమయమై, కనీస మరమ్మ తులకు నోచుకోని దాదాపు 160 కిలోమీటర్ల రహదారులను ఇకపై ఆధునిక ప్రమా ణాలతో, అత్యంత నాణ్యతతో నిర్మించనున్నారు.

ఆర్థిక రంగానికి ఊతం.. గ్రామీణ ప్రజలకు లబ్ధి..

ఈ రోడ్ల పునర్నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే కాదు, స్థానిక ఆర్థిక రంగాన్ని కూడా బలోపేతం చేయనుంది: రైతులు పండించిన పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు మార్గం సుగమం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వెళ్లే రోగులకు సకాలంలో వైద్యం అందేలా ప్రయాణ సమయం తగ్గుతుంది.మెరుగైన రవాణా వ్యవస్థ వల్ల నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు

ఈ భారీ నిధుల మంజూరు పట్ల కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, రైతులు మరియు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో కల్వకుర్తి మరిన్ని ప్రగతి ఫలాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

‘నా దూరదృష్టి, ప్రజా సమస్యలపై నిరంతర స్పందన, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత వల్లే కల్వకుర్తికి ఈ స్థాయిలో రహదారి నిధులు సాధ్యమయ్యాయి. ఈ ప్రాజెక్టులతో గ్రామాల అనుసంధానం మెరుగుపడి, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు అందుబాటులోకి వస్తాయి. కల్వకుర్తిని మోడల్ నియోజకవర్గంగా మార్చడమే నా లక్ష్యం. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజల రుణం తీర్చుకుంటున్నా.‘

కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి