26 May, 2026 | 4:41 PM

రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి: మృత్తిక శాస్త్రవేత్త కిరణ్

26-05-2026 03:39 PM

మఠంపల్లి మే 26(విజయ క్రాంతి): ఖరీఫ్ సీజన్ కు ముందు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని గడ్డిపల్లి కెవికె మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తమ నేల యొక్క భూసారాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు తగ్గించి భూసారాన్ని కాపాడుకుంటూ అధిక,సుస్థిర దిగుబడులు పొందవచ్చని సూచించారు.భూసార పరీక్షలు చేయడం ద్వారా పోషకాల పరిమాణమే కాకుండా భూమిలోని చౌడు,సున్నం శాతాన్ని గుర్తించవచ్చని,రైతులు తమ పొలంలోని మట్టిని సేకరించి గడ్డిపల్లిలోని కేవీకే కు పంపించినట్లయితే రైతులకు భూసార పరీక్ష చేసి భూఆరోగ్య పత్రాలు అందజేస్తామని తెలిపారు.మట్టి నమూనాలు సేకరించే విధానానికి 7893989055 నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్,మండల విస్తరణ అధికారులు శ్రావ్యంజలి,త్రివేణ మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.