బాల్యవివాహాలను నిర్మూలించాలి
గుంజపడుగులో అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య బానేష్
మంథని, మే 26(విజయక్రాంతి): బాల్య వివాహాలను నిర్మూలించాలని ఇందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేనా సంధ్య భానేష్ కోరారు. మంగళవారం మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా బాల్యవివాహాలపై అవగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య బానేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకు వివాహాలు చేయాలనే చట్ట నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.
బాల్య వివాహాల వల్ల ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన తల్లి శిశువుకు ఆరోగ్యం ప్రమాదకరమన్నారు. అలాగే కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఈ మేరకు గుంజపడుగు గ్రామంలో అందరి సహాయ సహకారాలతో బాల్యవివాహాలను అడ్డుకోవాలని సర్పంచ్ గ్రామ ప్రజలను కోరారు. పిల్లలను చదివించాలని చట్టాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ అరుణ, ఉప సర్పంచ్ ఎలుక లక్ష్మీ సదానంద, వార్డు సభ్యులు భోగే రాజేశ్వరి, దేవళ్ళ లక్ష్మీ, దొడ్డిపట్ల శంకర్, బోగే సంపత్తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






