రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
- బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
- స్పెషల్ డ్రైవ్ చేపడతాం
- నేత్ర వైద్య శిబిరం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్నివైపుల నుంచి చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి పద్మశాలి భవనంలో మంగళవారం పోలీసుల ఆద్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ కిరణ్ కుమార్ హాజరైమాట్లాడుతూ... నిర్లక్ష్యపూ డ్రైవింగ్ వల్లనే వేలమంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నారన్నారు. ప్రతిరోజు, ప్రతి గంటకు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వాపోయారు.
కంటి చూపు లోపం కూడా రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా గుర్తించి ఆటోడ్రైవర్లకు నేత్ర వైద్యo కోసం కంటి పరీక్షలు చేపిస్తున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడిపితే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రజల్ని క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యతను వారెప్పుడూ విస్మరించకూడదని గుర్తు చేశారు. అటు ప్రయాణికుల, ఇటు తమ కుటుంబ సభ్యులు జీవితాలు ఆటో డ్రైవర్లపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలనన్నారు. వారం రోజుల్లోనూ ప్రతి వాహనదారుడు సంబంధిత వాహన పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఆ తరువాత బెల్లంపల్లిలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఇక ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రతి వాహనదారుడికి లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ కలిగి ఉండటం వారి బాధ్యత అని తెలిపారు. ఇలాంటి జాగ్రత్తలు కూడా ప్రత్యేకంగా తామే చెప్పాల్సిరావడం దురదృష్టకరమనీ వాపోయారు. పోలీసులుగా శాంతి భద్రతలతో పాటు ప్రజల వ్యక్తిగత జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణ కూడా తమ విధుల్లో భాగం చేసుకున్నామన్నారు. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఆప్తమాలజిస్టులు అంజయ్య బృందం కంటి పరీక్షలు నిర్వహించింది. తగిన వైద్యం చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు అరుణ సుందరి, వినోద్ ,నర్సింగం పాల్గొన్నారు.




