11 June, 2026 | 2:33 AM

కమలం పార్టీలో కోవర్టులు లేరు!

11-06-2026 01:21 AM
  1. కాంగ్రెస్‌లో ఎవరున్నారో మాకు తెలియదు
  2. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు, బీజేపీకి సంబంధం లేదు
  3. మహారాష్ట్ర సీఎంకు లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని బయటపెట్టాలి
  4. రేవంత్‌కు నిజంగా కలవాలని ఉంటే నేను తీసుకెళ్తా..
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరున్నారో మాకేం తెలుసు.. బీజేపీలో మాత్రం కోవర్టు లు లేరు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. మహారాష్ట్ర మఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయలేదని, ఒకవేళ లేఖ రాస్తే.. రేవంత్ రెడ్డి దానిని బయటపెట్టాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

యూపీ ఏ హయాంలో అనేక కుంభకోణాలు చూశామని, 12 ఏళ్ల మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణను చూశామన్నారు. ప్రధానిగా అత్యధికకా లం సేవలందించి మోదీ సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని కొనియాడారు.

బేగంపేట పర్యాటక భవన్‌లో మోదీ 12 ఏళ్ల పాలనపై.. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యమనే పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి రామచందర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

మళ్లీ మోదీయే పీఎం..

దేశ ప్రధానిగా పుష్కరకాలం పూర్తిచేసుకున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు. 12 ఏళ్లలో విరామం లేకుండా దేశ ప్రగతి కోసం మోదీ పనిచేశారని, ప్రధానిగా ఇంకా మూడేళ్ళ పదవీకాలం ఉందని, ఆతర్వాత కూడా మోదీనే ప్రధాని అవుతారని  ధీమా వ్యక్తంచేశారు. మోదీ ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చారన్నారు. యూపీఏ-1, యూపీఏ-2లో అనేక కుంభకోణాలు చూశామని, 12 ఏళ్ళ మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణను చూశా మన్నారు.

స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల శౌచాలయాలు నిర్మించారని, తెలంగాణ కు జాతీయ పసుపు బోర్డు ఇచ్చామన్నారు. ఐదు వందే భారత్ రైళ్లు తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, తెలంగాణలో కేంద్రం కొత్త రైల్వే లైన్లు, 45 రైల్వే స్టేషన్లు ఆధునీకరించిందన్నారు. 4,926 కిలో మీటర్ల జాతీయ రహదారులను తెలంగాణలో ఏర్పాటు చేసిందన్నారు.  రాష్ట్రానికి 28 కొత్త నవోదయ స్కూల్స్ ఇచ్చిందని, బీబీనగర్‌లో కేంద్రం ఎయిమ్స్ ఏర్పాటు చేసిందని, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. 

సీఎం అబద్ధాలు మాట్లాడొద్దు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడవద్దని రాంచందర్‌రావు హితవు పలికారు. ‘సీఎం ఎన్ని సార్లు పీఎంను కలవలేదు, హైదరాబాద్‌లో కూడా మోదీని రేవంత్ రెడ్డి కలిశారు’ అని గుర్తుచేశారు. ఢిల్లీకి పోయి సీఎం ఎవరెవరిని కలిశారో తన దగ్గర సమాచారం ఉందన్నారు. అభివృద్ధిలో కలిసిరావాలని ముఖ్యమంత్రిని మోదీ ఇటీవల బహిరంగ సభలో కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయలేదని,  లేఖ రాస్తే.. రేవంత్ రెడ్డి బయటపెట్టాలన్నారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి మాట్లాడి అపాయింట్‌మెంట్ అడిగితే తప్పకుండా ఇస్తారని, రేవంత్‌రెడ్డికు నిజంగా కలవాలని ఉంటే తాను తీసుకెళ్తానన్నారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు.. బీజేపీకి ఏమీ సంబంధంలేదన్నారు.  నీట్ పరీక్షలో పొరపాటు జరిగిందని గుర్తించారని, అయితే విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలు చేయడం మంచిదికాదని  పేర్కొన్నారు.

మోదీ 140 కోట్ల మంది విశ్వాసం.. 

మోదీ చరిత్రాత్మక మైలురాయి అధిగమించారని రాంచందర్ రావు అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, ఆకాంక్షలకు ప్రతీక అని తెలిపారు. 4,399 రోజులు భారతీయ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిన రోజులన్నారు. గరీబ్ కళ్యాణ్ నుంచి మహిళా సాధికారత వరకు, రైతుల గౌరవం నుంచి యువతకు అవకాశాల సృష్టి వరకు, ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్ నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం వరకూ మార్పు స్పష్టంగా కనబడుతుందన్నారు.

ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధి, బలమైన సరిహద్దులు, ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన ఆధునీకరణ, స్టార్టప్ సంస్కృతి ఎదుగుదల లాంటివన్నీ జాతీయ పునరుజ్జీవానికి కొత్త యుగాన్ని సూచిస్తున్నాయన్నారు. 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తిచేసి, జవహర్‌లాల్ నెహ్రూ 4398 రోజుల పాలనా రికార్డును మోదీ అధిగమించారని తెలిపారు.