అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల టౌన్, మే 21: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. చేయూత పథకంకు సంబంధించి గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శులు, వార్డ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామ పంచాయితీ కార్యదర్శులు తమ గ్రామాలకు సరిగ్గా వెళ్లకుండా ఫేక్ హాజరు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మంగళవారం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించాలని, ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశించినప్పటికీ సరిగ్గా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు వర్తించేందుకు పంచాయతీ కార్యదర్శులు సహకరించాలన్నారు.
సర్పంచులకు, సెక్రటరీలకు తెలియకుండా గ్రామాల్లో బాల్యవివాహాలు జరగవని, ఇలాంటి వివాహాలను ఆపేందుకు నిర్లక్ష్యం వహించే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెల రెండో మంగళవారం విలేజ్ చైల్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని చిన్నారులపై అఘాయిత్యాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావడానికి తమ వంతుగా సహకరించాలని సూచించారు.
జూన్ 25వ తేదీలోగా ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో విధులు నిర్వహించే వార్డు అధికారులు కూడా తమ ప్రాంతంలోని ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉత్తమ సేవలు అందించే గ్రామపంచాయతీ కార్యదర్శులకు, సంబంధిత సర్పంచులకు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్కరిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఆర్డిఓ ముషాహిదా బేగం, ఇతర అధికారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.






