18 May, 2026 | 3:30 AM

పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

18-05-2026 02:25 AM

బోధన్, మే 17 (విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బోధన్ పట్టణంలో ఆదివారం సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ..., కేంద్ర ప్రభుత్వ తప్పిదాల కారణంగానే సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోందని ఆరోపించారు. మే 10న హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని పొదుపు సూత్రాల గురించి మాట్లాడి, యుద్ధ సమయాల్లో కూడా ధరలు పెంచకుండా ప్రజలను కాపాడామని చెప్పారని, ఇప్పుడు అదే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.

దేశంలో తగినంత చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో భారీ ర్యాలీలు నిర్వహించి, ప్రస్తుతం యుద్ధ ప్రభావం పేరుతో ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం అన్యాయమన్నారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకుడు సీహెచ్ రమేష్, పీఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, బీపాషా బేగం, టీయూసీఐ నాయకులు రెహానా బేగం, సునీత, ఎస్.కే. కాజా, బి. శంకర్, సాయిలు, పోశెట్టి, సలీం, గౌస్, బాబు తదితరులు పాల్గొన్నారు.