అఫ్గనిస్థాన్‌లో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత
న్యూఢిల్లీ, జూన్ 27 (విజయక్రాంతి): ఆఫ్గనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రకంపనలు భారత్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కెమినిస్తాన్‌లలో కూడా సంభవించాయి. అధికారుల ప్రకారం శనివారం రాత్రి 7.04 గంటలకు ఆఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం వల్ల కలిగిన ప్రకంపనలు భారతదేశం, మధ్య ఆసియా అంతటా సంభవించాయి.
కాగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘానిస్థాన్‌లోని జుర్ముక్ దక్షిణంగా 43 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భారత్‌లో ఢిల్లీలోని నోయిడా, గురుగ్రామ్, జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ లోని చంబా జిల్లాలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హిమాలయలోని ధర్మశాలకు 22 కి.మీ. దూరంలో 5 కి.మీ. లోతులో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
పాక్‌లోనూ భూ ప్రకంపనలు..
పాకిస్థాన్‌లో శుక్రవారం నుంచి వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 4.3 నుంచి 5.3 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల వల్ల పలు మట్టి ఇళ్లు కూలిపోయాయి. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్లలోనుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప కేంద్రం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూమికి 40 కి.మీ. లోతులో ఉందని అధికారులు పేర్కొన్నారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందింపజేస్తున్నారు.






