మొహర్రం ఊరేగింపులో కుట్ర భగ్నం?
- విష గుళికలను పంచేందుకు ప్రయత్నం.. నిందితుడి అరెస్ట్
- 14,900 మాత్రలు, 50 కిలోల జింక్ ఫాస్పేట్ స్వాధీనం
ముంబై, జూన్ 27 (విజయక్రాంతి): మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి ప్రజలకు విష గుళికలు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 14,900 మాత్రలు, 50 కిలోల జింక్ ఫాస్పేట్ (ఎలుకలను చంపే మందు)ను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) తెలిపారు. మొహర్రం ఊరేగింపులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని, అక్కడి ప్రజలకు మాత్రలు పంచి పెడుతున్నట్టుగా సమాచారం అందిందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితుడిని పుణె విమాన్ నగర్‌కు చెందిన ఫయాజ్ ప్రేమ్జీగా గుర్తించామన్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర కోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడు ఇచ్చిన గుళికను మింగడం వల్ల ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు డీసీపీ వివరించారు.






