29 August, 2026 | 1:29 AM

ప్రధాన కూడలిలో స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు!

29-08-2026 12:30 AM

ప్రమాదాలకు నిలయంగా మారిన కాసాలరెడ్డి, ఖానాపూర్ రహదారి

హత్నూర, ఆగస్టు 28 :కాసాలరెడ్డిఖానాపూర్ గ్రామాల మధ్య ఉన్న మూడు రహదారుల కూడలి ప్రమాదాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు వైపుల నుంచి వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కూడలి వద్ద వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ మార్గం ద్వారా కాసాల, రెడ్డిఖానాపూర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.

సమీపంలోని అరబిందో పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు కూడా ఇదే రహదారిని వినియోగిస్తుండటంతో కూడలి వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మూడు రహదారులు కలిసే ప్రాంతం కావడంతో వాహనాలు వేగంగా రావడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే కూడలి వద్ద పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, గాయాలు సంభవించిన ఘటనలు ఉన్నాయని వారు తెలిపారు.

ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం అవసరమని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ కూడలిపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కోరుతున్నారు. అంతేగాకుండా కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు, అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెంటనే చర్యలు చేపట్టాలని, మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడవద్దని స్థానికులు కోరుతున్నారు.