25 July, 2026 | 3:09 AM

‘మై ల్యాండ్ ఫామ్స్’కు నోటీసులు

25-07-2026 01:30 AM

చేవెళ్ల, జులై 24 (విజయక్రాంతి): చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు రెవెన్యూ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కన్జర్వేషన్ జోన్గా గుర్తించిన ప్రాంతంలో వాణిజ్య (కమర్షియల్) కట్టడాలు చేపట్టిన ‘మై ల్యాండ్ ఫామ్స్‘ నిర్వాహకులకు అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆలూరు సర్వే నంబర్లు 189, 90, 91 తో పాటు ఆలూరు-2 పరిధిలోని 51, 52, 53 సర్వే నంబర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ వెంచర్ పనులు వేగంగా సాగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ కథనాలపై తక్షణమే స్పందించిన రెవెన్యూ, ఎంపీడీఓ, డిఎల్పీఓ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి కన్జర్వేషన్ జోన్లో అక్రమంగా కట్టడాలు చేపడుతున్నది వాస్తవమేనని తేలింది. దీంతో స్థానిక విలేజ్ సెక్రటరీ ద్వారా ‘మై ల్యాండ్ ఫామ్స్‘ యాజమాన్యానికి నోటీసులు అందించారు. ఈ వ్యవహారంపై 5 రోజుల్లోగా పూర్తి వివరణ ఇచ్చి, సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. అధికారుల నోటీసులపై సదరు ఫామ్ ల్యాండ్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.