సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం
కల్లూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ సాధిక్ అలీ 63వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి ఉషా శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం 15 డ్యూయల్ డెస్క్‌లను విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. రత్న మాధురి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి. పద్మ మాట్లాడుతూ, సాధిక్ అలీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ ఆయన ఆశయాలను ఉషా కొనసాగించడం అభినందనీయమని అన్నారు.
పురపాలక సంఘ చైర్మన్ డి. మోహన్ సాధిక్ అలీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు కరోనా కాలంలో పేద విద్యార్థులకు ఆయన అందించిన సహాయాన్ని ప్రశంసించారు. ఉషా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో సాధిక్ అలీ కృషి చేశారని, అదే మార్గంలో తాను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి నివాళులు అర్పించారు. ఉషా దాతృత్వాన్ని పురపాలక సంఘ పెద్దలు, శాంతినగర్ పెద్దలు సన్మానించారు. పాఠశాలకు వుడెన్ ర్యాక్ అందించిన కంటిపూడి మేరమ్మను కూడా సత్కరించారు.






