హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవభారత్ హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని హెచ్‌పిసిఎల్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ లు కోమర శ్రీనివాసు, రాహుల్ సింగ్ లు శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఖమ్మం ఏరియా సేల్స్ మేనేజర్ పవన్ నరేష్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, పరిపాలనా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, గ్యాస్ సిలిండర్ల నిల్వలు, గ్యాస్ బుకింగ్ విధానం, వినియోగదారులకు సకాలంలో సిలిండర్ల సరఫరా, డెలివరీ వ్యవస్థ, వినియోగదారుల భద్రతా ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా గ్యాస్ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాత గ్యాస్ పైపులను సకాలంలో సురక్ష పైపులతో మార్చే ప్రక్రియ, ప్రతి వినియోగదారుకు భద్రతా అవగాహన కల్పించే చర్యలు, వినియోగదారుల ఈ-కేవైసీ నమోదు పురోగతి, హెచ్. పి. సి. యల్ వారి మార్గదర్శకాల అమలు వంటి అంశాలను సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా అమలు చేయాలని సూచించారు.
తనిఖీ అనంతరం డిప్యూటీ జనరల్ మేనేజర్ లు కోమర శ్రీనివాసు, రాహుల్ సింగ్ లు మాట్లాడుతూ, పాల్వంచ నవభారత్ హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీలో అన్ని కార్యకలాపాలు నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట సమయం లో సక్రమంగా నిర్వహిస్తున్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, స్టాక్ నిర్వహణ, వినియోగదారులకు సేవలందించడం, భద్రతా ప్రమాణాల అమలు, ఈ-కేవైసీ ప్రక్రియ తదితర అంశాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని స్థానిక హెచ్పి గ్యాస్ ఆఫీసు మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ కు సూచించారు. ఏజెన్సీ నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తున్న మేనేజర్ లు అనంతుల లక్ష్మీనారాయణను, ఆఫీసు సిబ్బంది రజిత, నరేష్, ప్రకాష్, రాజాబాపు లను ఈ సందర్భంగా శ్రీనివాసులు, రాహుల్ సింగ్ లు ప్రత్యేకంగా అభినందించారు. వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన సేవలు అందించాలని, ప్రతి గ్యాస్ వినియోగదారునికి భద్రతా సూచనలను చేరవేయాలని సూచించారు.






