1 June, 2026 | 2:46 AM

హామీలు అమలు చేసే దమ్ముందా?

01-06-2026 02:07 AM

చేతకాకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించాలి

  1. సీఎం రేవంత్‌కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
  2. మోటర్లకు మీటర్లపై సీఎం అబద్ధం చెబుతుండు
  3. ఉచిత విద్యుత్ ఎత్తివేతకే ‘రైతు డిస్కం’
  4. రేవంత్ చెప్పింది చేయడని ప్రజలకు అర్థమైంది
  5. కార్యకర్తల సమావేశంలో విమర్శలు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని, చేతకాకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని  ప్రకటించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకున్న ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని విమర్శించారు.

నిన్న ముఖ్యమంత్రి రైతుల మోటార్లకు మీట ర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పు డు రైతన్నలకు కేవలం 3 గంటల కరెం ట్ ఇస్తే సరిపోతుందని చెప్పి, సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు అందకుండా చేసేం దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్‌రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ‘రైతు డిస్కం’ అంటే రైతన్న మెడకు ఉరి పెట్టినట్టేనన్నారు. తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న తెలంగాణ పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విష యం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కేటీఆర్ అన్నారు.

అందుకే ఈరోజు రైతు డిస్కం పైన రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నీ ముమ్మాటికీ అబద్ధాలేనన్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరచకుండా, తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతన్నలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంట్ కోతలను పూర్తిగా తీర్చేలా చేసింది కేసీఆర్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ కరెంట్ కోతలు ఎంత తీవ్రంగా ఉండేవో గుర్తు చేసుకోవాలని కేటీఆర్ అన్నా రు. కరెంట్ కోసం రైతన్నలతో పాటు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు హాలిడేలు ప్రకటించి, పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి ని మర్చిపోవద్దన్నారు.

అంతటి దుస్థితి నుం చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని పనిని చేసి, 24 గంటల కరెంట్ రాష్ట్రానికి అందించిన నాయకుడు ముమ్మాటికీ కేసీఆర్ అన్నారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయ కుడు కేసీఆర్ అని అన్నారు. కానీ కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారన్నారు.  

‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పైన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారని, ఆ కేసు కోర్టులో ఉం డగానే ఎన్నికలు నిర్వహించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని, అందుకే అందరూ సర్‌లో పాల్గొ ని ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

‘కంటోన్మెంట్’కు చేసిందేమీ లేదు..

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం కంటోన్‌మెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక సం దర్భం గా పొంగులేటితోపాటు పలువురు మంత్రు లు ప్రచారానికి వచ్చి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 6 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.

కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రక్షణ శాఖ భూములను ఇస్తే కరీంనగర్ వైపు, నిజామాబాద్ వైపు స్కైవేల నిర్మాణం చేస్తామని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన ఏనాడూ స్పందించలేదన్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్ చేసిన ఒత్తిడి మొన్న ఫలించిందన్నారు. ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లను మూసేస్తే, అప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్య తీర్చామని గుర్తు చేశారు. 

బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఉచిత తాగునీరు, లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పేదలకు ప్రభుత్వ భూములను అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నా రు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత  హైడ్రా పేరు తో వేలాది పేదల ఇండ్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగ రానికి తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను దేశం మొత్తం తిరస్కరిం చిందని, తెలంగాణలో ఆ దరిద్రం తిరిగి వచ్చింన్నారు. 

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయి: కేటీఆర్ ట్వీట్

2023లో తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయో దయచేసి రాహుల్‌గాంధీ వివరించగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.12,000 ఇస్తామని మీరు హామీ ఇచ్చారని. 30 నెలలు గడిచిపోయినా, ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలే ఇంకా పెండింగ్‌లో ఉంటే, ఢిల్లీలో ఈ నాటకాలు ఎందుకు? అని ప్రశ్నించారు.