నకిలీ ట్రక్ చీటీలతో ధాన్యం మళ్లింపు
- రూ.91 లక్షల నిధుల దుర్వినియోగం
- ఆరుగురు నిందితుల అరెస్ట్
రాజన్న సిరిసిల్ల, జూన్ 20(విజయక్రాంతి): ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చీటీలను సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియా సమావేశంలో వెల్లడించారు.పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఉత్కం విజయ్ (ఏ1), సూపర్‌వైజర్ వాసాల గణేష్ (ఏ5) కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ చీటీలను తయారు చేశారు.
రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జి గడ్డం స్వామి (ఏ3) రెండు లారీలకు నకిలీ చీటీలను జారీ చేయగా, వాటిని సివిల్ సప్లయ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను కాజేసినట్లు విచారణలో తేలింది. అలాగే డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (ఏ2), బద్దెనపల్లి పీఏసీఎస్ ఇన్‌చార్జి గాజుల నవీన్ (ఏ6) సహకారంతో మరో నకిలీ ట్రక్ చీటీ సృష్టించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో మాత్రం దించినట్లు నమోదు చేసి, ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (ఏ4)కు అప్పగించారు.అనంతరం సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (ఏ7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన డబ్బును పరస్పరం పంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ఎస్. నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో మొత్తం రూ.91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు నిర్ధారణ అయింది.పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.14,16,800 నగదు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.46,21,358 మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు.అరెస్టయిన నిందితులను రిమాడ్‌కు తరలించగా, కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.






