పేదల సంక్షేమమే ఎమ్మెల్యే లక్ష్యం
97 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవలు అభినందనీయం: కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు, మే 29 : మునుగోడు నియోజకవర్గంలోని పేద ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. దాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఇస్తున్న హమాలి, లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రైతులకు సరిపోక అదనపు భారం పడుతుండటంతో, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే స్వయంగా రూ.10 లక్షల 20 వేల రూపాయలు చెల్లించడం గొప్ప విషయమన్నారు.
బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారని, కాల్వ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.
జూన్ 2వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరును ప్రారంభిస్తోందని, అలాగే గత పదేళ్లలో అందని కొత్త పెన్షన్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.






